న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో 2027 మార్చి 1జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో చేస్తారు. కేంద్ర సెన్సెస్ కమిషనర్, రిజిస్టర్ జనరల్ మృంత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలు చేశారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో తొలి దశలో 2026ఆక్టోబర్ 1వ తేదీకి జనగణన చేపట్టనున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రెండో దశలో 2027, మార్చి 1 నుంచి జన గణనను చేపట్టనున్నారు. అయితే ఈసారి జనాభా లెక్కలతోపాటే కుల గణనను కూడా చేపట్టనున్నామని ప్రకటించిన కేంద్రం ఆ విషయాన్ని గెజిట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించకపోవడంతో కులగణన చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత కొరవడింది.
దేశంలో 1872నుంచి జనగణన చేస్తున్నారు. ఈ ధఫా జనాభా సేకరణ ప్రక్రియ 16వ ప్రక్రియ కాగా..స్వాతంత్రం అనంతరం చేపట్టనున్న 8వ జనాభా గణన కావడం గమనార్హం. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఓసారి నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను చివరిసారిగా 2011లో చేపట్టారు. మళ్లీ 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 16ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దేశంలో జన గణనకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 30 కి పైగా ప్రశ్నలు సిద్ధం చేశారు. 2021లో జరిగిన జన గణనకు రూ.12695.58 కోట్లు కేటాయించగా ఈసారి జన గణనకు 13 వేల కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతానికి కేంద్రం 2025-26 బడ్జెట్ లో కేవలం రూ. 574.80 కోట్లు నిధులను కేటాయించింది. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులను సవరించనున్నారు. దేశ వ్యాప్తంగా జనాభా గణనకు 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది జనాభా లెక్కల కోసం పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలో సాగుతుందని ఇప్పటికే హోం శాఖ వెల్లడించింది. సెక్షన్ 3 జనగణన చట్టం 1948 ప్రకారం జన గణన చేపట్టనున్నారు.