UPSC lateral entry । 45 కీలక పదవుల్లో లేటరల్ ఎంట్రీ విధానంతో నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. స్వపక్షంలోని జేడీయూ, ఎల్జేపీతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నది. ఈ ప్రకటనను రద్దు చేయాల్సిందిగా యూపీఎస్సీ (Union Public Service Commission) చైర్మన్ ప్రీతి సుదాన్‌కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం లేఖ రాశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖను ఆదేశించారని ఆ లేఖలో జితేంద్రసింగ్ తెలిపారు. రాజ్యాంగంలోని సమానత్వం (equity), సామాజిక న్యాయం (social justice) సూత్రాలకు అనుగుణంగా లేటరల్ ఎంట్రీ ప్రక్రియ ఉండాలనేది ప్రధాన మంత్రి దృఢ విశ్వాసమని జితేంద్రసింగ్ ఆ లేఖలో తెలిపారు. ప్రత్యేకించి రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకోవాలనేది ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు. లేటరల్ ఎంట్రీ పద్ధతిలో నియామకాలు పాతవే అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్లకు కేంద్రం సిద్ధపడటం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా ఈ పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనుంచి వెనుకడుగు వేయడం అనేదే లేదు. ఒక్క వ్యవసాయ చట్టాల విషయంలో మాత్రం పుట్టి మునగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఉపసంహరించుకున్నది. ఇప్పుడు మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న తొలి సందర్భం ఇదే. రిజర్వేషన్లు వర్తింపజేయకుడా ఇలా దొడ్డిదారిని తమకు నచ్చినవారిని నియమించుకోవడంపై వెల్లువెత్తిన ఆగ్రహాలతో నష్టనివారణ చర్యలకు దిగిన మోదీ సర్కారు వెనుకడుగు (retreat) వేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలతోపాటు.. స్వపక్షంలోని భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మోదీ సర్కారుకు సెగ గట్టిగానే తాకింది.
సామాజిక న్యాయం, రాజ్యాంగాన్ని బీజేపీ మార్చివేస్తుందనే విమర్శ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయంశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీకి చార్ సౌ పార్ (400 సీట్లు) అంటూ అధికార పార్టీ ఊదరగొట్టింది. అయితే.. రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ 400 సీట్లు గెలవాలని చూస్తున్నదని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. ఈ అంశమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం చేసింది. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితికి బీజేపీని ఈ పరిణామం నెట్టింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా సీట్లు తగ్గిపోయాయి. తాజాగా యూపీఎస్సీ ప్రకటన రాగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం విస్మరిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు బాహాటంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. లేటరల్ ఎంట్రీ విధానంతో ఆరెస్సెస్‌వాదులను ఆయా పోస్టుల్లో చొప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
అసలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) సామాజిక న్యాయం అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ఎజెండా తీసుకోనున్న నేపథ్యంలో తాజా లేటరల్ ఎంట్రీ విధానంలో నియామకాల అంశం వాటికి బ్రహ్మాస్త్రాన్ని అందించినట్టే అవుతుంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిలో లోక్‌జనశక్తి పార్టీ (రాంవిలాస్) (Lok Janshakti Party (Ram Vilas)), జేడీయూ (Janata Dal (United)) దళితులు, వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకును ఆధారం చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. అవి సైతం లేటరల్ ఎంట్రీ విధానంపై బహిరంగంగానే విమర్శలకు దిగడంతో మోదీ ప్రభుత్వానికి మరో మార్గం లేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కిందపడ్డా తనదే పైచేయి అని చాటుకునే పద్ధతిలో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం.. రిజర్వేషన్ల విషయంలో మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర మంత్రి లేఖ ద్వారా చెప్పుకొనేందుకు ప్రయత్నించిందని అంటున్నారు. అయితే.. ప్రభుత్వ వెనుకడుగును తమ విజయంగా చాటుకున్న ప్రతిపక్షం.. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాన మంత్రి బలహీనపడిపోయారని పేర్కొన్నది. అందుకే లేటరల్ ఎంట్రీ విషయంలో ఒత్తిడికి తలొగ్గిందని వ్యాఖ్యానించింది. ‘2024 ఎన్నికల్లో రెండు ఫలితాలు వచ్చాయి: ఒక బలహీన ప్రధాని.. ఒక బలమైన ప్రతిపక్ష నేత. అంతిమంగా ఇది రాజ్యాంగం సాధించిన విజయం’ అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.