Site icon vidhaatha

Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..22మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్ లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లతో 22మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఆండ్రీ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 18మంది మావోయిస్టులు, కాంకేర్ ఎదురుకాల్పుల్లో మరో ఇద్ధరు మృతి చెందినట్లుగా భద్రతాధికారులు వెల్లడించారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్​కు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

బీజాపుర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

రెండు చోట్ల ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భద్రతా సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఈ రోజు మన సైనికులు ‘నక్సల్-ఫ్రీ ఇండియా క్యాంపెయిన్’ దిశగా మరో పెద్ద విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో భద్రతా దళాలు జరిపిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు మరణించినట్లుగా అమిత్ షా పేర్కొన్నారు. నక్సలైట్లపై నిర్దాక్షిణ్యంగా ముందుకెళ్తున్న మోదీ ప్రభుత్వం లొంగిపోవడం నుంచి పునరావం వరకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నప్పటికి.. లొంగిపోని నక్సలైట్లపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 లోపు దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందని స్పష్టం చేశారు.

మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా చత్తీస్ గఢ్  అడవుల్లో సాగుతున్న ఆపరేషన్ కగార్ తో పచ్చని గిరిజన పల్లెలు రక్తమోడుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బల పాలవుతూ పెద్ద సంఖ్యలో పార్టీ మిలటరీ సభ్యులను కోల్పోతుంది. ఛత్తీస్ గఢ్ లో  గత ఏడాది 287మంది మావోయిస్టులు హతమవ్వగా..ఈ  ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 100మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

Exit mobile version