Site icon vidhaatha

డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. 48 మందిని కాపాడి ప్రాణాలు కోల్పోయాడు..

ఓ ప్ర‌యివేటు బ‌స్సు వేగంగా దూసుకెళ్తోంది. డ్రైవ‌ర్‌కు ఛాతీలో నొప్పి వ‌చ్చింది. త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన డ్రైవ‌ర్.. ప్ర‌యాణికుల ప్రాణాల‌ను కాపాడాల‌కున్నాడెమో.. బ‌స్సును తీసుకెళ్లి గోడ‌కు ఢీకొట్టాడు. దీంతో అత‌ను ప్రాణాలు కోల్పోయి.. ప్ర‌యాణికుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని కంధ‌మాల్ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మా ల‌క్ష్మీ స‌ర్వీసెస్‌కు చెందిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు శుక్ర‌వారం రాత్రి కంధ‌మాల్ జిల్లాలోని స‌ర‌న్‌గ‌ర్హ్ నుంచి రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు బ‌య‌ల్దేరింది. కంధ‌మాల్ జిల్లాలోని ప‌భురియా గ్రామం వ‌ద్ద‌కు బ‌స్సు రాగానే డ్రైవ‌ర్‌కు ఛాతీలో నొప్పి వ‌చ్చింది. దీంతో త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించాడు. బ‌స్సులో ఉన్న 48 మంది ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించొద్ద‌నే ఉద్దేశంతో రోడ్డు ప‌క్క‌నున్న గోడ‌కు బ‌స్సును ఢీకొట్టాడు. అనంతరం డ్రైవ‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని డ్రైవ‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక బ‌స్సును మ‌రో డ్రైవ‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కు తీసుకెళ్లాడు. మృతుడు సానా ప్ర‌దాన్ డెడ్‌బాడీని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. 

Exit mobile version