అమరావతి : వాహనాలలో ప్రయాణించేవారి ప్రాణాలకు డ్రైవర్ సంరక్షుడు అన్న మాటకు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. కాలేజీ బస్సు నడుపుతుండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు ఆపి విద్యార్థుల ప్రాణాపాయం తప్పించి..తను తనువు చాలించిన విషాద ఘటన అందరిని కలిచివేసింది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దెందుకూరి నారాయణరాజు (60) సోమవారం ఉదయం విద్యార్థుల్ని కాలేజీకి తీసుకెళ్తుండగా.. జాతీయ రహదారి 216ఏ వద్ద అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు.
గుండెపోటు వస్తుందని గ్రహించుకున్న నారాయణరాజు వెంటనే కాలేజీ బస్సుని సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి విద్యార్థులకు ప్రమాదం జరుగకుండా చూసుకున్నాడు. ఆ వెంటనే క్షణాల్లోనే అక్కడే కుప్పకూలిపోయాడు. విద్యార్థులు వెంటనే డ్రైవర్ నారాయణరాజును ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. తాను చనిపోతూ విద్యార్థుల్ని కాపాడిన నారాయణరాజుని చూసిన విద్యార్థులు, స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. నారాయణ రాజు మరణం పట్ల వారంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు.
