న్యూఢిల్లీ : బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పాట్నా విమానాశ్రయంలో భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని, అతని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా అతని క్రికెట్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారని గుర్తు చేసిన మోదీ అభినందనలు తెలిపారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అండర్ 19లో సంచలన ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికైన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ పై కేవలం 38 బంతుల్లో 101 పరుగులు (7 ఫోర్లు, 11 సిక్సర్లతో) సాధించిచారిత్రాత్మక ఇన్నింగ్ ఆడాడు.
అతని ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 94 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం. అంటే తన శతకంలో 93% పరుగులు బౌండరీల ద్వారానే సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీలోనైనా బౌండరీల ద్వారా సాధించిన అత్యధిక పరుగుల శాతంగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు సెంచరీలు సాధించిన 58 మందిలో వైభవ్ సూర్యవంశీ తన శతకంలో అత్యధిక బౌండరీ పర్సంటేజీతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రికార్డును సాధించడం ద్వారా అతను తన సహచర ఆటగాడు యశస్వి జైస్వాల్ రికార్డును బద్దలు కొట్టాడు.

రెండో రోజు.. బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ
రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న పట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. దేశం వెనక్కి తగ్గదు.. బిహార్‌లో అభివృద్ధి ఆగదు అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆ రాష్ట్రంలోని కరకట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతామని..ఇదే సరికొత్త భారత్ విధానమని తెలిపారు. పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని.. దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బిహార్ వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.