Site icon vidhaatha

Credit Card Rules | ఈ బ్యాంకు క్రెడిట్‌కార్డులున్నాయా..? ఏప్రిల్‌ నుంచి రివార్డు పాయింట్లు కట్‌..!

Credit Card Rules | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం బాగా పెరిగింది. బ్యాంకులు సైతం విరివిరిగా కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలవనున్నది. అయితే, బ్యాంకుల పలు కార్డుల్లో కీలక మార్పులు చేపట్టనున్నాయి. ఈ జాబితాలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకులున్నాయి. లాంజ్‌ యాక్సెస్‌తో పాటు రివార్డు పాయింట్లలో కీలక మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మారిన రూల్స్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా మారనున్న రూల్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..!

ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డులు..

ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్‌కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు రెంట్‌ చెల్లింపులపై రివార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక ఏప్రిల్‌ ఒకటి నుంచి రివార్డు పాయింట్ల జారీని నిలిపివేయనున్నది. ఎస్‌బీఐ ఎలైట్‌, సింప్లీ క్లిక్‌, ఎస్‌బీఐ ఆరమ్‌ కార్డుల యూజర్లపై ప్రభావం పడనున్నది.

ఐసీఐసీఐ బ్యాంక్​

ఐసీఐసీఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మార్చింది. రాబోయే త్రైమాసికంలో ఈ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే.. మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.35వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌, మేక్‌ మై ట్రిప్‌, ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ సహా పలు కార్డుల రూల్స్‌ను మార్చింది. ఈ మార్పులన్నీ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తాయి.

ఎస్‌ బ్యాంక్‌..

ఎస్‌ బ్యాంక్‌ లాంజ్‌ యాక్సెస్‌ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఏ త్రైమాసికంలో అయినా లాంజ్‌ సదుపాయం పొందాలనుకుంటే అంతకుముందు త్రైమాసికంలో ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు ద్వారా కనీసం రూ.10వేలు ట్రాన్సాక్షన్స్‌ చేయాల్సి ఉంటుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం రివార్డుల పాయింట్లలో మార్పులు చేసింది. మాగ్నస్‌ క్రెడిట్‌కార్డు లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక ఫీజులో మార్పులు చేసింది. బీమా, గోల్డ్‌, ఆభరణాలు, ఇంధనం కోసం జరిపే చెల్లింపులపై రివార్డులు పాయింట్లు నిలిపివేయనున్నది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ కోసం త్రైమాసికంలో కనీసం రూ.50వేల వరకు ట్రాన్సాక్షన్‌ జరపాల్సి ఉంటుంది. క్యాలెండర్‌ ఇయర్‌లో నేషనల్‌, ఇంటర్నేషనల్‌ లాంజ్‌లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ విజిట్‌ సంఖ్యను 4కి తగ్గించింది. కొత్త మార్పులు ఏప్రిల్‌ 20 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.

Exit mobile version