VK Pandian | మాజీ ఐఏఎస్‌కు కేబినెట్ హోదా.. ఒడిశా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

  • Publish Date - October 24, 2023 / 10:26 AM IST

VK Pandian | ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌యివేటు సెక్ర‌ట‌రీ కొన‌సాగుతున్న ఐఏఎస్ అధికారి వీకే పాండియ‌న్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. వీఆర్ఎస్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే ఒడిశా ప్ర‌భుత్వం ఆమోదించింది. 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే.. వీకే పాండియ‌న్‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ ఒడిశా గ‌వ‌ర్న‌మెంట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప‌ట్నాయ‌క్ స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పాండియన్‌ను 5టీ(Transformation Initiatives), న‌బిన్ ఒడిశా ప‌థ‌కానికి చైర్మ‌న్‌గా నియ‌మించింది. ఈ మేర‌కు ఒడిశా జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ ప‌బ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక ముఖ్య‌మంత్రి ప‌ట్నాయ‌క్ కింద పాండియ‌న్ ప‌ని చేయ‌నున్నారు.

వీకే పాండియ‌న్ వీఆర్ఎస్ తీసుకోవ‌డాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు స్వాగ‌తించాయి. అధికార పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం వీకే పాండియ‌న్ త‌న అధికారాన్ని దుర్వినియోగ‌ప‌రిచార‌ని కాంగ్రెస్, బీజేపీలు మండిప‌డ్డాయి. ఒక వేళ ఆయ‌న బీజేడీలో చేరితే.. ప్ర‌తిప‌క్షాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని, ప్ర‌త్యేకంగా కాంగ్రెస్‌కు ఎంతో స‌హాయం చేసిన వార‌వుతార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్ స‌లుజా పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ స‌ప్త‌గిరి ఉల్కా కూడా స్పందించారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే.. వీకే పాండియ‌న్ సీఎం ప‌ద‌వి చేప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని పేర్కొన్నారు. ఒడిశాలో ఏం జ‌రుగుతుందో అంతు చిక్క‌డం లేద‌న్నారు. కానీ ఎవ‌ర్ని ఎవ‌రు నియంత్రిస్తున్నారో అంద‌రికీ తెలుసు అని ఎంపీ స‌ప్త‌గిరి పేర్కొన్నారు.

బీజేపీ చీఫ్ విప్ మోహ‌న్ మాజ్హీ మాట్లాడుతూ.. ఇప్పుడు వీకే పాండియ‌న్ బ‌హిరంగంగా రాజ‌కీయాలు చేసుకోవ‌చ్చ‌న్నారు. అత‌న్ని ఒడిశా ప్ర‌జ‌లు అంగీక‌రించ‌రు అని పేర్కొన్నారు.

త‌మిళ‌నాడుకు చెందిన వీకే పాండియ‌న్ ఒడిశా కేడ‌ర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2002లో క‌ల‌హండి జిల్లాలోని ధర్మ‌గ‌ర్హ్ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా పాండియ‌న్ త‌న ఐఏఎస్ కేరీర్‌ను ప్రారంభించారు. 2006లో మ‌యూర్‌భంజ్ క‌లెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. 2007లో గంజం క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలోనే న‌వీన్ ప‌ట్నాయ‌క్ దృష్టిని ఆక‌ర్షించారు పాండియ‌న్. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ది కూడా గంజం జిల్లానే. 2011లో సీఎంవోలో చేరారు పాండియ‌న్. అప్ప‌ట్నుంచి ప‌ట్నాయ‌క్ ప్ర‌యివేటు సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. 2019లో ఐదోసారి సీఎంగా ప‌ట్నాయ‌క్ ప్ర‌మాణం చేసిన అనంత‌రం వీకే పాండియ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 5టీ సెక్ర‌ట‌రీగా నియామ‌కం అయ్యారు.

Latest News