- 2023లో చైనాను క్రాస్ చేయనున్న భారత్
- సగం జనాభా భారత్ మరో 8 దేశాల్లోనే..
విధాత: ప్రపంచ జనాభా నేటితో 800 కోట్లకు చేరింది. ఫిలిఫిన్స్ రాజధాని మనీలాలోని టోండోలో మంగళ వారం తెల్లవారుజామున 1:29 గంటలకు ఓ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి జన్మించడంతో.. కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన ప్రకారం.. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది.
8వ బిలియన్‌గా పుట్టిన ఈ పాపకు మబాన్సాగ్ అని నామకరణం చేశారు. మనీలాలోని డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ ఆస్పత్రిలో ఈ పాప పురుడు పోసుకుంది. ప్రస్తుతం ఈ పాప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ జనాభాకు వంద కోట్ల మంది కొత్తగా జత కావడానికి 12 ఏండ్ల సమయం పట్టినట్లు పేర్కొన్నారు.
LOOK: Meet baby girl Vinice Mabansag—isa sa sumisimbolo bilang ika-8 bilyong tao sa mundo. Ipinanganak siya sa Dr. Jose Fabella Memorial Hospital kaninang 1:29am. | @gmanews pic.twitter.com/RQE0NSZCjm
— Nico Waje (@nicowaje) November 14, 2022
అత్యధిక జనాభా దిశగా భారత్..
ఇక 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అంటే చైనాను భారత్ మించిపోనుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది.
ఈ ఏడాది జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2030 నాటికి 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు జనాభా చేరుకోనుందని అంచనా వేసింది. 2080 నాటికి 1040 కోట్లకు చేరుకొని, 2100 నాటికి అదే స్థాయిలో జనాభా ఉంటుందని పేర్కొంది.
ఇక 2023లో చైనా జనాభాను భారత్ అధిగమించనుంది. భారత్‌తో పాటు కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫీన్స్, టాంజానియా దేశాల్లో కూడా జనాభా పెరిగిపోనుంది. 2050 నాటికి పెరుగుతుందని అంచనా వేస్తున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా పై ఎనిమిది దేశాల్లోనే ఉండనుందని అంచనా.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, ఓషియానాలలో జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ శతాబ్దం చివరి నాటికి సానుకూలంగా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్, యూరప్, ఉత్తర అమెరికాలలో జనాభా పతాకస్థాయికి చేరుకుని, 2100 నాటికి తగ్గుదల కనిపించనుంది.