Telangana Cabinet: ఎప్పుడెప్పుడా అని ఆశావహులను ఊరిస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు మూహుర్తం ఖారారైనట్లుగా సమాచారం. రేపు ఆదివారం తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. శనివారం సాయంత్రం ఈ మేరకు రాజ్ భవన్ నుంచి అధికార ప్రకటన వెలువడనుంది. మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికి కొత్తగా ముగ్గురికి చోటు కల్పిస్తారని..మరికొంత కాలం తర్వాతా మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని తెలుస్తుంది. అయితే రేపటి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోబోతున్న ఆ ముగ్గురు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
ఎందుకంటే ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం ఇప్పటికే డజన్ మంది వరకు ఆశావహులు ఏడాదిగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. 2023డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తొలుత 12మందితో మంత్రివర్గం ఏర్పాటైంది. ఏడాదిన్నరగా వారితోనే పరిపాలన నెట్టుకొస్తున్నారు. మిగిలిన ఆరు మంత్రి పదవుల భర్తీ కోసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణలు, జిల్లాలు, రాజకీయ అవసరాలు వంటి సమీకరణల మధ్య మంత్రివర్గ విస్తరణ కసరత్తు సుదీర్ఘకాలంగా సాగుతోంది.
మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశమివ్వాలంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఓ వైపు, మాదిగ సామాజిక వర్గం, లంబాడ, ముదిరాజ్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మరోవైపు..ఎవరికి వారు గట్టి ప్రయత్నాలే చేశారు. మంత్రి పదవులను ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి ముదిరాజ్, గడ్డం వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, అమేర్ అలిఖాన్ లలో ఎవరికి మంత్రివర్గ విస్తరణలో చాన్స్ దక్కనుందన్న అంశం రేపటితో తేలిపోనుంది.