BSNL | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) జోరుమీదున్నది. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌ను తీసుకువస్తూ యూజర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ దేశవ్యాప్తంగా విడుదలవారీగా 4జీ సేవలను విస్తరిస్తూ వస్తున్నది. త్వరలోనే 5జీ సేవలను సైతం మొదలుపెట్టనున్నది. ఈ క్రమంలోనే సంస్థ పూర్వవైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నది. ఇటీవల ప్రైవేటురంగ టెలికం కంపెనీలైన జియో, భారతీయ ఎయిర్‌టెల్, వొడాఫోన్ – ఐడియా టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. ధరలు పెంచిన నేపథ్యంలో యూజర్లంతా ఆగ్రహంతో ఉన్నారు. పలువురు ఆయా నెట్‌వర్క్‌లను వీడి మరో నెట్‌వర్క్‌కి మారుతున్నారు. ఇప్పటికే లక్షల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్త కస్టమర్లు చేరారు.
ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న యూజర్లతో పాటు కొత్త యూజర్లను ఆకట్టుకునేలా.. పోటీ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నది. తాజాగా మరో ఆకర్షణీయమైన 30 రోజుల ప్లాన్‌ను యూజర్‌లకు పరిచయం చేసింది. ఈ ప్లాన్ రూ.147కే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. తక్కువ ఖర్చుతో నెల ప్లాన్‌ను పొందాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రైవేటు టెలికం సంస్థలు ఇంత సరసమైన ధరకు 30 రోజుల రీచార్జ్ ప్లాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. దాంతో పాటు ప్లాన్‌లో డేటా ప్రయోజనం సైతం ఉంటుంది. నెలకు 10 జీబీ డేటా వరకు లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ కాలర్ ట్యూన్ సేవలను సైతం అందిస్తున్నది. అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవనం లేకుండానే తమకు నచ్చిన పాటలను కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు.