Akshaya Tritiya : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నా జనం లెక్క చేయడం లేదు. అందుకే అక్షయ తృతీయ అమ్మకాలు ఏమాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది గోల్డ్ రేటు 15-17 శాతం ఎక్కువ ఉన్నప్పటికీ.. శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటైల్ నగల వ్యాపారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈసారి అక్షయ తృతీయకు గోల్డ్ సేల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని, ముఖ్యంగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాల్లో పుత్తడి విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి చైర్మన్ సైయం మెహ్రా చెప్పారు.
ఈసారి అక్షయ తృతీయ నాడు తులం పసిడి రూ.71 వేలు పలుకగా.. గత ఏడాది ఇదే సమయంలో రూ.60 వేలుగానే ఉంది. గురువారం నుంచి చూస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.800 పెరిగిందని, ఇది అమ్మకాలపై 5-7 శాతం ప్రభావం చూపిందని, లేదంటే విక్రయాలు మరింత ఎక్కువ జరిగేవనే అభిప్రాయాన్ని మెహ్రా వ్యక్తం చేశారు. ధర ఎక్కువే ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఈసారి సేల్స్ అంచనాలకు మించే జరిగాయని మెజారిటీ వ్యాపారులు చెప్పడం విశేషం. ఇక వెడ్డింగ్ జ్యుయెలరీ లాంటి హెవీ వెయిట్ ఐటమ్స్‌కు దక్షిణాది మార్కెట్‌లో డిమాండ్ కనిపించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇది పెండ్లిళ్ల సీజన్ కానప్పటికీ పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎక్కువ కుటుంబాలు భారీ డిజైన్ నగల కొనుగోళ్లకే దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యం ఇచ్చాయని మెహ్రా వివరించారు. అయితే ఉత్తరాదితోపాటు ఇతర రాష్ర్టాల్లో తేలికపాటి ఆభరణాలకే ఆదరణ ఉన్నదని తెలిపారు. ఈసారి బంగారం అమ్మకాలపై ధరల ప్రభావం లేదని పీఎన్‌జీ జ్యుయెలర్స్ సీఎండీ సౌరభ్ అన్నారు. కాగా శనివారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ సేల్స్ జరగనున్నాయి.