హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ వ్యవస్థ ఇక మరింత పటిష్టం కానుంది. వ్యర్థాల నిర్వహణ, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ సేవల్లో అగ్రగామి అయిన రీ సస్టెయినబిలిటీ రెల్డాన్ సంస్థతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (ఎస్ఏసీ) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్ని శాస్త్రీయంగా సేకరించి, వేరు చేసి, పర్యావరణానికి హాని కలగని రీతిలో వినియోగిస్తారు. బాధ్యతాయుత ఈ-వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్య దోహదపడుతుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎస్ఏసీ 5,000 చదరపు అడుగుల గిడ్డంగి వంటి మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సమన్వయం చేస్తుంది. సేకరణ కోసం స్వయం సహాయక బృందాల్ని ప్రోత్సహిస్తుంది. రీ సస్టెయినబిలిటీ రెల్డాన్ తమ సాంకేతిక నైపుణ్యంతో అత్యంత సమర్థవంతమైన వనరుల రికవరీ టెక్నాలజీల ద్వారా ఈ-వ్యర్థాల్ని నిబంధనల ప్రకారం, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం మొదట విజయవాడలో ప్రత్యేక ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రంతో ప్రారంభమవుతుంది. అనంతరం దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి సమగ్ర ప్రణాళికతో ఈ-వ్యర్థాల్ని సేకరిస్తారు. ఎస్ఏసీ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ తదితరుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, “సర్క్యులర్ ఎకానమీ, పర్యావరణహిత వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలే కాకుండా పర్యావరణ బాధ్యత, ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం” అని అన్నారు. రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో మసూద్ మాలిక్ స్పందిస్తూ.. “పారేసిన ఎలక్ట్రానిక్స్‌ను వ్యర్థాలుగా కాకుండా వనరులుగా భావించే పర్యావరణహిత భవిష్యత్తు కోసం ఈ భాగస్వామ్యం ఒక ముందడుగు. బాధ్యతాయుత రీసైక్లింగ్, సమర్థవంత వనరుల రికవరీ ద్వారా ముడి వనరుల వెలికితీత ఒత్తిడిని తగ్గించి, తక్కువ ఉద్గారాల ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. పర్యావరణాన్ని కాపాడేందుకు, వనరుల్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఎస్ఏసీతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది” అని అన్నారు.