Pan Card | పిల్ల‌ల‌కు పాన్ కార్డు అవ‌స‌రం ఉంటుందా..? మ‌రి పొంద‌డం ఎలా..?

Pan Card | ఆధార్ కార్డు( Aadhaar Card ) మాదిరిగానే ప్ర‌తి ఒక్క‌రికి పాన్ కార్డు( Pan Card ) కూడా ముఖ్య‌మే. పుట్టిన ప్ర‌తి బిడ్డ‌కు ఆధార్ కార్డు జారీ చేస్తారు. మ‌రి పాన్ కార్డు జారీ చేస్తారా..? ఒక వేళ పిల్ల‌ల‌కు పాన్ కార్డు అవ‌స‌ర‌మైతే ఎలా పొందాలి..?

  • Publish Date - September 1, 2024 / 10:57 PM IST

Pan Card | ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు( Aadhaar Card ) ఎంత అవ‌స‌ర‌మో.. పాన్ కార్డు( Pan Card ) కూడా అంతే అవ‌స‌రం. ఎందుకంటే ప్ర‌తి లావాదేవీకి పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి. బ్యాంకు( Bank )లో లోన్ పొందాల‌న్నా.. ఇత‌ర బ్యాంకు అవ‌స‌రాల కోసం పాన్ కార్డు ఉండాల్సిందే. అయితే పిల్ల‌ల‌కు( Minors ) కూడా పాన్ కార్డు అవ‌స‌రం ఉంటుందా…? ఒక వేళ అవ‌స‌రం ఉంటే.. పాన్ కార్డును ఎలా పొందాలో తెలుసుకుందాం..

బ్యాంకు అవ‌స‌రాల‌తో పాటు ఆదాయ‌పు ప‌న్ను( Income Tax ) ఫైలింగ్‌కు పాన్ కార్డు కీల‌కం. కేవైసీ( KYC ) ధ్రువీక‌ర‌ణ ప‌త్రంగా కూడా దీన్ని ప్ర‌భుత్వం అంగీక‌రిస్తోంది. ఇక పిల్లల పేరుమీద ఇన్వెస్ట్‌మెంట్స్( Investments ) ఉన్న సమయంలో వారికి పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఒకవేళ తల్లిదండ్రుల పెట్టుబడులకు వారిని నామినీగా చేర్చేందుకు పాన్ కార్డు వినియోగిస్తారు. ఇక మైనర్ల పేరిట బ్యాంకు ఖాతా( Bank Account ) తెరిచేటప్పుడు, వారికి ఏదైనా ఆదాయ వనరు ఉన్న పక్షంలో పాన్ సమర్పించాల్సి ఉంటుంది.

మ‌రి 18 ఏండ్ల కంటే త‌క్కువ వ‌య‌సున్న వారు కూడా పాన్ కార్డు పొందొచ్చు. వీరి త‌ర‌పున వారి త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. పెద్దలకు పాన్‌ ఎలాగైతే అప్లై చేస్తామో మైనర్ల కోసం కూడా దాదాపు అదే పద్ధతి ఫాలో కావాలి. ఇందుకోసం ఫారమ్ 49Aని వినియోగించాలి. ఈ ఫారమ్‌పై గార్డియన్‌గా తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి.

వివరాల అప్‌లోడ్ సమయంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో సహా ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పాన్ కార్డు పనికిరాదు. ఎందుకంటే మైనర్‌లకు జారీ చేయబడిన పాన్ కార్డ్‌లో వారి ఫోటో లేదా సంతకం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తులు తప్పనిసరిగా పాన్ కార్డ్‌ అప్‌డేట్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.