Income Tax | ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులంతా తప్పనిసరిగా జూలై 31 నాటికి ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సిందే. లేకపోతే జరిమానా చెల్లించతప్పదు. అలాగే, వడ్డీ సైతం చెల్లించాల్సి రానున్నది. మొత్తం చెల్లించడంలో విఫలమైతే జైలుశిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నది. గడువులోగా ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే రూ.5వేల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను సెక్షన్ 234F కింద జరిమానా విధించేందుకు అవకాశాలున్నాయి. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకు ఉంటే రూ.1000 జరిమానా విధించేందుకు అవకాశం ఉన్నది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు పెరిగితే.. జరిమానా సైతం రూ.5వేల వరకు పెరుగుతుంది. అయితే, ఆదాయం ప్రాథమిక మినహాయింపు (రూ. 2.50 లక్షలు) కంటే తక్కువగా ఉంటే మాత్రం జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు స్వల్పంగా నష్టపోయే అవకాశాలుంటాయి. నిజానికి పెట్టుబడుల్లో నష్టపోయే చెల్లింపుదారులు ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాన్ని వచ్చే ఏడాది ఆదాయానికి జోడించడం ద్వారా పన్ను బాధ్యతను భరిస్తుంటారు. ఈ ప్రక్రియను క్యారీ ఫార్వర్డ్‌గా పిలుస్తుంటారు. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేసిన వారికి మాత్రమే ఇందులో ప్రయోజనం ఉంటుంది. ఆదాయపు పన్ను ఆలస్యంగా చెల్లిస్తే.. ఆదాయపు పన్ను సెక్షన్ 234A కింద వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని నెలకు ఒక శాతం చొప్పున వసూలు చేస్తుంటారు. మీ ఆదాయంపై రూ.2లక్షల పన్ను చెల్లించాల్సి వస్తుంది అనుకుంటే.. చివరివరకు పన్ను చెల్లించకుండా.. ఐదునెలల తర్వాత అంటే డిసెంబర్‌లో ఐటీఆర్ దాఖలు చేస్తూ రూ.10వేల వడ్డీ చెల్లించాల్సి రానున్నది. దీంతో వడ్డీ భారం విపరీతంగా పెరుగుతుంది. గడువు ముగిసినా బకాయిలు చెల్లించపోతే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కట్టాల్సిన పన్నును బట్టి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరిమానాతోనూ వదిలేసే అవకాశం ఉంటుంది. రూ.25వేల కన్నా ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు.. రూ.25వేలలోపుగా ఉంటే మూడు నుంచి రెండు సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశాలున్నాయి.
Income Tax | ఐటీఆర్ ఫైలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నది మిత్రమా..! గడువు తీరిందంటే జరిమానా, జైలుశిక్ష తప్పదు
