Site icon vidhaatha

సెబీకి DRHP.. సమర్పించిన కనోడియా సిమెంట్ లిమిటెడ్

సిమెంట్ తయారీ సంస్థ కనోడియా సిమెంట్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద ‘ఆఫర్ ఫర్ సేల్’ విధానంలో 1,49,13,930 షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరించనుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. కనోడియా సిమెంట్‌కు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌లో శాటిలైట్ గ్రైండింగ్ యూనిట్స్ ఉన్నాయి. పోర్ట్‌ల్యాండ్ పొజొలానా సిమెంట్, కాంపోజిట్ సిమెంటు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది.

క్రిసిల్ నివేదిక ప్రకారం భారత్‌లో సిమెంట్ కాంట్రాక్ట్ తయారీకి సంబంధించి కనోడియా సిమెంట్ అగ్రగామిగా ఉంది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం 3.54 ఎంటీపీఏ స్థాయిలో తయారీ సామర్థ్యంతో అయిదు శాటిలైట్ గ్రైండింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. 2014-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సిమెంట్ గ్రైండింగ్‌కి సంబంధించి పరిశ్రమ సామర్థ్యాలు వార్షిక ప్రాతిపదికన సగటున 7.31 శాతం, పోటీ సంస్థల సామర్థ్యాలు 9.64 శాతం మేర వృద్ధి చెందగా కంపెనీ 22.12 శాతం వృద్ధి సాధించింది.

తద్వారా సదరు వ్యవధిలో స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం పెంపు విషయంలో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సిమెంట్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిల్చింది. 2022-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అమ్మకాలపరంగా కూడా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. పరిశ్రమ వార్షిక వృద్ధి సగటున 11.10 శాతం, పోటీ సంస్థల సగటు వృద్ధి 8.80 శాతంగా ఉండగా, కంపెనీ 36.14 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ వ్యవధిలో సంస్థ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 34.83 శాతం వృద్ధి చెందింది. పరిశ్రమ సగటు 13.61 శాతంగా, పోటీ సస్థల సగటు 12.04 శాతంగా నమోదైంది. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, వన్‌వ్యూ కార్పొరేట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా (బీఆర్ఎల్ఎం) వ్యవహరిస్తున్నాయి.

Exit mobile version