New Rule from 1 July 2024 | జూలై ఒకటి నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్‌ ధర నుంచి ఎఫ్‌డీలు, క్రెడిట్‌కార్డు పేమెంట్స్‌ వరకు జరిగే మార్పులు ఇవే..!

New Rule from 1 July 2024 | ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలో ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పలు నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మారనున్న నిబంధనలతో ప్రజలపై ఆర్థికంగా భారంపడే అవకాశం ఉండనున్నది.

  • Publish Date - June 30, 2024 / 01:00 PM IST

New Rule from 1 July 2024 | ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలో ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పలు నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మారనున్న నిబంధనలతో ప్రజలపై ఆర్థికంగా భారంపడే అవకాశం ఉండనున్నది. సాధారణంగా ఒకటో తేదీ నుంచి గ్యాస్‌, ఇంధన ధరలను చమురు కంపెనీలు మారుస్తుంటాయి. ఫలితంగా ధరలు పెరగడంతో పాటు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరో వైపు పలు బ్యాంకులు సైతం నిబంధనలను సవరించబోతున్నాయి. దేశంలో ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైనా ఇండియన్‌ బ్యాంక్‌తో పాటు పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ప్రత్యేక ఎఫ్‌డీల గడువు జూన్‌ నెలాఖరుతో ముగియనున్నది. అలాగే, పలు క్రెడిట్‌కార్డులకు సంబంధించిన మార్పులు సైతం జరుగబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

ఎల్‌పీజీ సిలిండర్‌ ధర..

ఎల్‌పీజీ సిలిండర్ల ధర ప్రతినెలా మొదటి తేదీన మారుతుంది. దాంతో జూలై ఒకటిన ఉదయం 6 గంటలకు కొత్త ధరలు అమలులోకి వస్తుంటాయి. గత కొద్ది రోజుల నుంచి చమురు కంపెనీలు కమర్షియల్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు చేస్తూ వస్తున్నాయి. జూన్‌ ఒకటిన వాణిజ్య సిలిండర్‌ ధరలను కంపెనీలు తగ్గించాయి. ఎన్నికలకు ముందు కేంద్రం డొమెస్టిక్‌ సిలిండర్‌పై తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ సారి కొత్తగా ధరలను పెంచుతుందా? పెంచుతుందా? చూడాల్సిందే.

ఇండియన్ బ్యాంక్ స్పెషల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ను అమలు చేస్తున్నది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు 300 రోజులు, 400 రోజుల స్పెషల్‌ ఎఫ్‌డీని అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. జూన్‌ 30 వరకు ఇండ్‌ సూపర్‌ 400, ఇండ్‌ సుప్రీమ్‌ 300 ఎఫ్‌డీ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత గడువు ముగియనున్నది. బ్యాంకు ఇండ్‌ సూపర్‌ ఎఫ్‌డీ 400 రోజుల స్కీమ్‌లో రూ.10వేల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. బ్యాంక్‌ సాధారణ ప్రజలకు 7.25శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.75శాతం, సూపర్‌ సీనియర్స్‌కు 8శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది. ప్రత్యేక టర్మ్ డిపాజిట్ ప్రోడక్ట్ ఇండ్ సూపర్ 300 రోజుల స్కీమ్‌ను జూలై 2023ని ప్రారంభించింది. ఇందులో రూ.5వేల నుంచి రూ.2కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. బ్యాంకు 7.05శాతం నుంచి 7.80శాతం వరకు వడ్డీని అందించనున్నది. ఇండియన్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.05శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వరకు.. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 వడ్డీని ఇస్తున్నది.

పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌..

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన కస్టమర్లకు 222 రోజులు, 333 రోజులు 444 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను అమలు చేస్తున్నది. ఈ స్పెషల్‌ ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 8.05శాతం వడ్డీని చెల్లిస్తుంది. బ్యాంక్ 222 రోజుల ఎఫ్‌డీలపై 7.05 శాతం, 333 రోజుల ఎఫ్‌డీలపై 7.10 శాతం, 444 రోజుల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 444 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్‌ 8.05 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది.

క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపు.. ఆర్‌బీఐ కొత్త రూల్స్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త రూల్స్‌ జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్‌బీఐ క్రెడిట్‌కార్డుల బిల్లుల చెల్లింపుల్లో కొన్ని మార్పులను చేసేంది. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) చేరిన బ్యాంకులు మాత్రమే ఫోన్‌పే, క్రెడ్‌, బిల్‌డెస్క్‌, ఇన్ఫిబీమ్‌ అవెన్యూ తదితర ఫిన్‌టెక్‌ కంపెనీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. బీబీపీఎస్‌లో చేరేందుకు బ్యాంకులకు జూలై ఒకటి వరకు గడువు విధించింది. ఆ తర్వాత జూలై ఒకటి నుంచి క్రెడిట్ కార్డ్ చెల్లింపులు బీబీపీఎస్‌ ద్వారా మాత్రమే జరగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇప్పటి వరకు క్రెడిట్‌కార్డుల జారీ చేసేందుకు అవకాశం ఉన్న 34 బ్యాంకుల్లో కేవలం 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్‌లో చెల్లింపులకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. అలాగే, ఫిన్‌టెక్‌ కంపెనీలు సైతం భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌లో రిజిష్టర్‌ అయ్యాయి.

Latest News