Adani Group | కొత్తగా మూడు వ్యాపారాల్లోకి అదానీ గ్రూప్‌..! డిజిటల్‌ పేమెంట్స్‌తో పాటు..!

Adani Group | ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నది. టెక్ దిగ్గజం గూగుల్‌, ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రియలన్స్‌కు పోటీగా ఆయన ఈ-కామర్స్‌, యూపీఐ పేమెంట్లకు సంబంధించిన డిజిటల్‌ కంపెనీని నెలకొల్పేందుకు సన్నాహాలను చేస్తున్నది.

  • Publish Date - May 29, 2024 / 10:00 AM IST

Adani Group | ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నది. టెక్ దిగ్గజం గూగుల్‌, ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రియలన్స్‌కు పోటీగా ఆయన ఈ-కామర్స్‌, యూపీఐ పేమెంట్లకు సంబంధించిన డిజిటల్‌ కంపెనీని నెలకొల్పేందుకు సన్నాహాలను చేస్తున్నది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదిక బయట పెట్టింది. కొవిడ్‌ మహమ్మారి పరిస్థితుల అనంతరం భారత్‌లో యూపీఐ సేవలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తుండగా.. ఇందుకోసం లైసెన్స్‌ పొందాలని గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో అదానీ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డుల కోసం బ్యాంకులతోనూ గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దాంతో పాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సర్వీసెస్‌ను సైతం మొదలుపెట్టాలని భావిస్తుందని నివేదిక తెలిపింది. కేంద్రం మద్దతుతో ఓపెన్ నెట్‌వర్క్‌ ఫర్ డిజిటల్ కామర్స్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. కంపెనీ భావించినట్లుగా ఆమోదం లభిస్తే అదానీ వన్‌ యాప్‌ ద్వారా సేవలు అందించబోతున్నట్లు తెలుస్తున్నది. అదానీ వన్‌ యాప్‌ని గ్రూప్‌ గతేడాది చివరలో లాంచ్‌ చేసింది. ఇందులో హోటల్‌, విమాన టికెట్లు తదితర ట్రావెల్‌ సంబంధిత సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం గ్రూప్‌కి ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని యూపీఐ, ఈ కామర్స్‌ సేవలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి వచ్చింది.

అదానీ ఎయిర్ పోర్టులు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులకు చేరువై.. ఆ తర్వాత మిగతా వినియోగదారులకు దగ్గరవ్వాలని కంపెనీ ప్రణాళిక రూపొందిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుత అదానీ గ్రూప్ కస్టమర్లకు బిల్ పేమెంట్‌ సర్వీసెస్‌ ఉపయోగించిన సమయంలో లాయల్టీ పాయింట్‌ అందించి.. ఆ తర్వాత ఆ పాయింట్స్‌ను అదే గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్‌లో రిడీమ్‌ చేసుకునేలా ప్రణాళిక రెడీ చేసినట్లు నివేదిక వివరించింది. ఇదిలా ఉండగా.. గతేడాది అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంచలన నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు మార్కెట్‌లో భారీగా పతనమయ్యాయి.

షేర్ల విలువను అధికంగా చూపేందుకు కంపెనీ మోసాలకు తెరలేపిందని హిండెన్‌బర్గ్‌ నివేదిక బయపెట్టింది. ఈ నివేదికతో అదానీ గ్రూప్‌ ఏకంగా 150 డాలర్లు నష్టపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సెబీ విచారణ జరుపుతున్నది. ఇప్పుడిప్పుడే మళ్లీ అదానీ షేర్లు రాణిస్తున్నాయి. ఇదే సమయంలోనే అదానీ కంపెనీ నాణ్యత లేని బొగ్గును ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు అదానీ గ్రూప్‌పై విమర్శలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని నిలువరించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇద్దరు నేతల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ షేర్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయని.. ఫలితంగా ఇన్వెస్టర్లు నష్టపోతున్నారనంటూ సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఇంజెక్షన్‌ దాఖలు చేశారు.

Latest News