Site icon vidhaatha

Ayodhya | అయోధ్య ఆర్మీ ప్రాంతం.. అదానీకి సమర్పయామి!

కొనుగోలుదారుల్లో బాబా రాందేవ్‌, శ్రీశ్రీ రవిశంకర్‌?
అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠకు ముందే కొనుగోలు
తాజాగా మే నెలలో డీనోటిఫై చేసిన యూపీ ప్రభుత్వం
14 జిల్లాలోని 5419 హెక్టార్లలో భూ కబ్జాలు
న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాది దూబే
హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే డీనోటిఫై
మతం, జాతీయవాదం మాటున బీజేపీ చేస్తున్నది ఇదీ
యూపీ, కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఫైర్‌

న్యూఢిల్లీ : అయోధ్యలోని సువిశాలమైన మిలిటరీ భూమిని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ డీనోటిఫై చేయడం, దానిని అంబానీ గ్రూపు, బాబా రాందేవ్‌, శ్రీశ్రీరవిశంకర్‌ వంటి ఉన్నస్థాయి వ్యక్తులు / సంస్థలు కొనుగోలు చేశారన్న వార్త పెను దుమారాన్ని రేపింది. డీనోటిఫై చేసిన భూమితో ఆర్మీకి ఇక ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఆలయ మ్యూజియం నిర్మిస్తుందని అయోధ్య డివిజినల్‌ కమిషనర్‌ హిందూ పత్రికకు చెప్పారు.

ఆర్మీ భూమి.. డీనోటిఫై

అయోధ్య జిల్లాలోని మాఝా జాంతారా గ్రామానికి చెందిన కొంత భూమిని డీనోటిఫై చేశారు. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందిన భారీ కంటోన్మెంట్‌ ఉండేది. డోగ్రా రెజిమెంటల్‌ సెంటర్‌ కూడా ఇక్కడే ఉన్నది. ఈ ప్రాతంలో ఫైరింగ్‌, ఆర్టిలరీ ప్రాక్టీసులను ఆర్మీ నిర్వహించేది. భద్రత, రక్షణ అంశాల రీత్యా ఈ ప్రాంతంలో నిర్మాణాలు, వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిషేధించారు. అయితే.. ఈ భూమిని అదానీ, బాబా రాందేవ్‌, శ్రీశ్రీ రవిశంకర్‌ కొనుగోలు చేసిన తర్వాతే డీనోటిఫై చేశారని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఆరోపించారు.

హైకోర్టులో కొనసాగుతున్న కేసు

ఆర్మీ కంటోన్మెంట్‌ చుట్టుపక్కల 14 గ్రామాలకు చెందిన 5419 హెక్టార్ల భూమి కబ్జాలకు గురైందని గతంలో న్యాయవాది ప్రవీణ్‌ దూబే అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో బెంచ్‌ దృష్టికి తెచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించిన ప్రవీణ్‌ దూబే ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ ఏడాది మే నెలలో ప్రత్యేకంగా మాఝా జాంతారాను డీనోటిఫై చేయడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ‘ఆ పద్నాలుగు గ్రామాల్లో కబ్జాలు ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను. ఇది భద్రత విషయంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశం’ అని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో బీజేపీ నాయకులు కూడా కమర్షియల్‌ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ఎవరూ దృష్టిపెట్టేందుకు సిద్ధం లేరని విమర్శించారు.

పార్కులు, బహిరంగ ప్రదేశాల కోసమే డీనోటిఫై : డివిజినల్‌ కమిషనర్‌

డీనోటిఫై చేయాల్సి రావడంపై అయోధ్య డివిజినల్‌ కమిషనర్‌ గౌరవ్‌ దయాళ్‌ స్పందిస్తూ.. మాఝా జాంతారా గ్రామం ఆర్మీకి చెందినది కాదని అన్నారు. నాజుల్‌, ప్రైవేటు యజమానుల చేతిలో ఉన్నదని తెలిపారు. అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ నోటిఫై చేసిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం.. ఈ ప్రాంతం పార్కులు, బహిరంగ ప్రదేశాల కోసం ఉద్దేశించినట్టు చెప్పారు. డీఎం సిఫార్సుల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి ఈ ప్రాంతాన్ని ఆర్మీ ఫైరింగ్‌ శిబిరాల కోసం నోటిఫై చేస్తుంటామని తెలిపారు.

కానీ.. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఫైరింగ్‌ శిక్షణ ఉండటంలేదన్నారు. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, వాటి అనుబంధ కార్యకలాపాలను అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాంతాన్ని డీనోటిఫై చేసినట్టు దయాళ్‌ చెప్పారు. ప్రభుత్వం ఇక్కడేమైనా నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నదా? అన్న ప్రశ్నకు.. ఒక భారీ టెంపుల్‌ మ్యూజియంను ఇక్కడ నిర్మించే ప్రతిపాదన ఉన్నదని దయాళ్‌ తెలిపారు.

మతం మాటున బీజేపీ చేస్తున్నది ఇదీ

అయితే.. ఈ ప్రాంతాన్ని డీనోటిఫై చేయడంపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై, యూపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొద్దిమందికి లబ్ధి కలిగించేందుకు బీజేపీ మతం మాటున ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ‘మతం, జాతీయవాదం మాటున వారు నిజానికి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్మీ బఫర్‌ జోన్‌గా నోటిఫై చేసిన భూమిని మొదట అదానీ, రవిశంకర్‌, బాబా రాందేవ్‌ కొనుగోలు చేశారు. అనంతరం దానిని గవర్నర్‌ డీ నోటిఫై చేశారు’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

కొనుగోళ్లు ఇలా..

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రెండు నెలల ముందు అంటే.. 2023 నవంబర్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన హోంక్వెస్ట్‌ ఇన్‌ఫ్రాస్సేస్‌ అనే కంపెనీ మాఝా జాంతారాలోని 1.4 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని ది ప్రింట్‌ పేర్కొన్నది. ఈ ప్రాంతంలో జనాభా ఉండదు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం నుంచి అయోధ్య రామాలయ ప్రాంగణం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భూమిని అదానీ సబ్సిడరీ గ్రూపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సీపీ శుక్లాకు చెందిన కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అంతకు ముందు శుక్లా.. ఈ భూమిని గత ఏడాది ఒక స్థానికుడి నుంచి కొనుగోలు చేశారని దిప్రింట్‌ తెలిపింది. అంతకు ముందే 2022 ఫిబ్రవరిలో శ్రీశ్రీ రవిశంకర్‌ నెలకొల్పిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పరిధిలో పనిచేసే వ్యక్తి వికాస్‌ కేంద్ర (వీవీకే) అనే రిజిస్టర్డ్‌ పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఇదే ప్రాంతంలో 5.31 హెక్టార్లను కొనుగోలు చేసిందని ప్రింట్‌ వెల్లడించింది.

మరోవైపు 2023 జూలైలో హర్యానా యోగ్‌ ఆయోగ్‌ చైర్మన్‌ జైదీప్‌ ఆర్య, ఇదే ట్రస్ట్‌కు చెందిన రాకేశ్‌ మిట్టల్‌ సహా మరో నలుగురు 3.035 హెక్టార్ల భూమిని కొనుగోలు చేశారు. యోగా గురు, పారిశ్రామికవేత్త రాందేవ్‌ బాబాకు చెందిన స్వాభిమాన్‌ ట్రస్ట్‌తో యోగ్‌ ఆయోగ్‌కు లింకులు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే.. కొనుగోలు చేసిన ఈ మూడు భూములు ప్రభుత్వం ఆర్మీ బఫర్‌ జోన్‌గా నోటిఫై చేసిన ప్రాంతంలోనివేనని ది ప్రింట్‌ తెలిపింది. మే 30, 2024న అంటే.. ఈ భూమి క్రయవిక్రయాలు పూర్తయిన తర్వాత సరిగ్గా ఇదే ప్రాంతాన్ని గవర్నర్‌ కార్యాలయం డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీనోటిఫై చేయడంతో ఇప్పుడు ఆ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు, నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది.

Exit mobile version