అదానీ కంపెనీ బడా మోసం!.. గుట్టు రట్టు చేసిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక

అదానీ గ్రూప్‌ బొగ్గు విషయంలో అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్టు చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక సంచలన విషయాలు బయటపెట్టింది.

  • Publish Date - May 23, 2024 / 06:45 PM IST

ఖరీదైన బొగ్గు పేరిట నాసిరకం సరఫరా
మూడు వేల కేలరీల పేరిట షిప్‌మెంట్లు..
ఆరు వేల కేలరీల పేరిట తమిళనాడుకు విక్రయం
ఇలా సింగపూర్‌ నుంచి 22 షిప్‌మెంట్లు
ఈడీ నా చీరలు లెక్కించడం పూర్తయితే.. అదానీపైకి పంపండి
ప్రధాని మోదీకి తృణమూల్‌ నేత మొయిత్రా సలహా
అధికారంలోకి రాగానే బొగ్గు కుంభకోణంపై విచారణ
మోదీ స్నేహితుడు లూటీ చేశాడన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ బొగ్గు విషయంలో అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్టు చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక సంచలన విషయాలు బయటపెట్టింది. ఖరీదైన, స్వచ్ఛమైన బొగ్గు పేరిట నాసిరకం బొగ్గును సరఫరా చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నదని, అదే క్రమంలో రెట్టింపు లాభాలు జేబులో వేసుకుంటున్నదని వెల్లడించింది. ఈ మేరకు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్పీ) సంపాదించిన పత్రాల ఆధారంగా పెన సంచలనాత్మక కథనాన్ని ఆ పత్రిక ప్రచురించింది. ఖరీదైన బొగ్గు పేరుతో పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అదానీ కంపెనీ గుట్టును రట్టు చేసింది. అదానీ పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్న దాని వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది.

సింగపూర్‌లో 3వేల కేలరీలు.. తమిళనాడుకు వచ్చేసరికి ఆరువేలు!

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం.. 2014 జనవరిలో అదానీ గ్రూపు ఇండోనేసియా నుంచి బొగ్గు షిప్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్‌వాయిస్‌ చూపుతున్నది. అందులో కిలోకు 3500 కేలరీలు ఉన్నట్టు పేర్కొంది. అదే షిప్‌మెంట్‌ను తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (Tangedco)కు కిలోకు ఆరు వేల కేలరీలు ఉన్నట్టు చెబుతూ విక్రయించారు. ఆరువేల కేలరీల బొగ్గు అంటే అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన బొగ్గు అని అర్థం. ఈ ప్రక్రియలో రవాణా ఖర్చులు మినహాయిస్తే అదానీ రెట్టింపు లాభం పొందినట్టయిందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది.

ఇదే పార్టీల మధ్య జరిగిన జరిగిన 22 షిప్‌మెంట్‌ల పత్రాలను పరిశీలించగా.. మొత్తం 1.5 మిలియన్‌ టన్నుల బొగ్గును సరఫరాచేసినట్టు తేలింది. అంటే.. తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును చౌక ధరలకు కొనుగోలు చేసి, అదే బొగ్గును తమిళనాడుకు రెట్టిపు ధరలకు అమ్మేశారు. 2013 డిసెంబర్‌లో ఇండోనేషియా నుంచి టన్ను 28 డాలర్ల విలువతో బయల్దేరిన షిప్‌మెంట్‌.. ఇండియాకు చేరుకుని, అదానీ కంపెనీ దానిని తమిళనాడుకు అమ్మేసరికి అది కాస్తా టన్ను 92 డాలర్లు అయిపోయిందని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్పీ) సంపాదించిన పత్రాలను ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది.

ప్రాణాలు తీస్తున్న గాలి కాలుష్యం

గాలి కాలుష్యంతో కలిగే అనారోగ్యాలతో భారతదేశంలో ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారని 2022లో లాన్సెట్‌ అధ్యయనం ఒకటి వెల్లడించింది. బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లకు వందల కిలోమీటర్ల పరిధిలో శిశు మరణాలు అత్యధికంగా ఉంటున్నాయని పలు ఇతర అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి. దేశ విద్యుత్తు అవసరాల్లో 30 శాతాన్ని బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లు తీర్చుతున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం బొగ్గు కాల్చి విద్యుత్తును ఉత్పత్తి చేసేప్లాంట్ల నుంచి 15 శాతం ఉద్గారాలు, 30శాతం నైట్రోజెన్‌ ఆక్సైడ్‌, 50 శాతం సల్ఫర్‌ డయాక్సైడ్‌ విడుదలవుతాయని దశాబ్దం క్రితం ఒక అధ్యయనం వెల్లడించింది.

అదానీ బొగ్గు కుంభకోణాలపై గతంలో కూడా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక కథనాలు ప్రచురించింది. వాటి ఆధారంగా అదానీపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. మార్కెట్‌ ధరలకు మించి భారత్‌కు బొగ్గు సరఫరా చేసేందుకు మధ్య దళారీలకు అదానీ గ్రూపు దాదాపు 5 బిలియన్‌ డాలర్లు చెల్లించిందని ఆ కథనాల్లో పత్రిక పేర్కొన్నది.

ఎన్నికల వేళ కలకలం

ఇప్పటికే దేశాన్ని అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం దోచిపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీకి అదానీ సన్నిహితుడనే ప్రచారం కూడా ఉన్నది. ప్రస్తుతం ఎన్నికల వేళ సైతం ఆ ఆరోపణలను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. ఈ సమయంలో ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక సంచలన విషయాలు బయటపెట్టడం బీజేపీకి తీవ్ర ఇబ్బందికర అంశమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే.. అదానీ గ్రూప మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. బొగ్గు నాణ్యతను లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పాయింట్ల వద్ద కస్టమ్స్‌ అధికారులు, తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ శాస్త్రవేత్తలు తనిఖీ చేస్తారని తెలిపారు. ఇటువంటి ఆరోపణలు అహేతుకమని, ఆధార రహితమని కొట్టిపారేశారు.

అధికారంలోకి వస్తే అదానీ కుంభకోణాలపై జేపీసీ

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అదానీ బొగ్గు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ‘బీజేపీ పాలనలో భారీ బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫేవరెట్‌ స్నేహితుడు అదానీ నాసిరకం బొగ్గును మూడింతల ధరకు అమ్మడం ద్వారా వేల కోట్లు లూటీ చేశారు’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ దోచున్న సొమ్ము.. దేశ సాధారణ ప్రజలదని అన్నారు.

మోదీపై మహువా మొయిత్రా సెటైర్లు

అధిక ధరలకు నాసిరకం బొగ్గును సరఫరా చేసినట్టు వచ్చిన వార్తలపై స్పందించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా.. మోదీపై సెటైర్లు వేశారు. ‘నా చీరలు లెక్కించడం, నా స్నేహితులకు ఫోన్‌ చేయడం పూర్తయితే.. అదానీ అంశాన్ని దర్యాప్తు చేయమని సీబీఐకి, ఈడీకి చెప్పండి..’ అని ఆమె ఎక్స్‌లో మోదీని ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు.

Latest News