Real estate | ‘రియల్’ ఢమాల్‌.. నగరంలో మూడు నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు..!

Real estate | దేశంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నె.. ఇలా ఏడు నగరాల్లో నివాస గృహాల విక్రయంపై అన్‌రాక్‌ సంస్థ వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం.. ఏడు నగరాల్లో మొదటి మూడు నెలలు (జనవరి-మార్చి) 1.11 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. అదే రెండో త్రైమాసికం (మార్చి-జూన్‌) లో 1.17 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఆరు శాతం పెరుగుదల నమోదైంది.

  • Publish Date - June 29, 2024 / 10:02 AM IST

Real estate : దేశంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నె.. ఇలా ఏడు నగరాల్లో నివాస గృహాల విక్రయంపై అన్‌రాక్‌ సంస్థ వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం.. ఏడు నగరాల్లో మొదటి మూడు నెలలు (జనవరి-మార్చి) 1.11 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. అదే రెండో త్రైమాసికం (మార్చి-జూన్‌) లో 1.17 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఆరు శాతం పెరుగుదల నమోదైంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అంటేనే బిల్డర్లు జంకే పరిస్థితి నెలకొన్నది.

హైదరాబాద్‌ మహానగరంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 22,960 నివాస గృహాల నిర్మాణం జరిగితే, రెండో త్రైమాసికంలో 13,750 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఏకంగా 40 శాతం తగ్గుదల నమోదైంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో ఢిల్లీ 134 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ఇక్కడ మొదటి మూడు నెలల్లో కేవలం 7,270 యూనిట్లు మొదలైతే, రెండో త్రైమాసికంలో 17,030 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ముంబైలో 31 శాతం పెరుగుదల నమోదైంది. బెంగళూరులో కొత్త ప్రాజెక్టులు పెరగకపోయినా ఒక్క శాతం మాత్రమే తగ్గుదల నమోదైంది.

హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 19,660 ఇండ్లు అమ్ముడుపోగా.. రెండో త్రైమాసికంలో 15,085 ఇండ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మొదటి మూడు నెలలతో పోలిస్తే ఇండ్ల అమ్మకాలు 23 శాతం తగ్గిపోయాయి. దేశంలో ఢిల్లీ మినహా ఇతర మెట్రోనగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నంత రియల్‌ ఢమాల్‌ ఇతర నగరాల్లో లేదు. కోల్‌కతాలో 18 శాతం తగ్గుదల ఉంటే.. బెంగళూరు, పుణెల్లో ఎనిమిది, ముంబైలో మూడు, చెన్నైలో తొమ్మిది శాతం మేర ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. ఇండ్ల అమ్మకాలు పడిపోవడంలో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండటం పరిస్థితికి అద్దంపడుతుంది.

Latest News