Subbamma Jasti | ఈ తెలుగు బామ్మ ‌‌‌.. ఫోర్బ్స్ భార‌త‌ అత్యంత వృద్ధ బిలియ‌నీర్‌

తొంభైఒక్క ఏళ్ల వ‌య‌సులో ఓ తెలుగు బామ్మ ఫోర్బ్స్‌ జాబితాలోకి భార‌తీయ బిలియ‌నీర్‌గా రికార్డుల‌కెక్కింది. సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచింది. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాల‌కి ప్రవేశించింది. ఆవిడ‌ నికర సంపద 110 కోట్ల డాలర్ల(($1.1 billion)కు, అంటే మ‌న రూపాయ‌ల్లో సుమారు రూ.91 వేల కోట్లకు చేరుకుంది.

  • Publish Date - May 16, 2024 / 07:22 PM IST

ఎవ‌రీ సుబ్బమ్మ జాస్తి(Subbamma Jasti)?

సువెన్ ఫార్మాస్యూటికల్స్‌(Seven Pharma) సహ వ్యవస్థాపకుడు వెంకట్‌ జాస్తి(Venkat Jasti) మాతృమూర్తి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకట్‌ జాస్తి 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల గ్రూప్‌ నడిపేవారు. వాటిట‌న్నింటిలోనూ సుబ్బమ్మ భాగ‌స్వామి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌(Advent International)కు కొంత‌ వాటాను విక్రయించడంతో ఆమెకు కూడా అతిపెద్దమొత్తంలో సంప‌ద‌ వచ్చింది. సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను కూడా వారసత్వంగా పొందడంతో ఆమె పేరు మీద ఉన్న నిక‌ర ఆస్తుల విలువ భారీగా పెరిగింది.

ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుండి ఫార్మసీలో డ్యూయ‌ల్ పీజీ డిగ్రీ పొందిన ఆవిడ కుమారుడు వెంక‌టేశ్వర్లు, సెయింట్‌జాన్స్ యూనివ‌ర్సిటీ, న్యూయార్క్ నుండి ఇండస్ట్రియ‌ల్ ఫార్మసీలో మాస్టర్స్ చేసారు. ఈ వ‌య‌సులోనూ సుబ్బమ్మ వ్యాపార కార్యక‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటూ త‌న‌యుడికి విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తార‌ట‌. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో సుబ్బమ్మ 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 355 కోట్ల డాలర్ల నికర సంపదతో మొద‌టిస్థానంలో ఉన్నారు. సావిత్రి ప్రస్తుతానికి భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Latest News