Site icon vidhaatha

Tesla India launch | టెస్లాకు స్వాగతం..! ముంబైలో షోరూమ్​ ప్రారంభం

⦁ టెస్లా భారత్‌లో మొదటి అడుగు
⦁ మోడల్ Y కారు భారత మార్కెట్లోకి ప్రవేశం
⦁ త్వరలో ఢిల్లీ, బెంగళూరులలో కూడా పరుగులు
⦁ మోడల్ Y ధరలు, ఫీచర్లు, భవిష్యత్తు ప్రణాళికలు ఇవే!

Tesla India launch | ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla), ఎట్టకేలకు భారతదేశపు ఆటోమొబైల్ రంగంలోకి అధికారికంగా ప్రవేశించింది. ముంబయిలోని ప్రీమియం వ్యాపార ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లోని Maker Maxity మాల్ లో తొలి టెస్లా షోరూమ్ (Tesla Experience Centre) ను ప్రారంభించింది. ఈ కార్యాలయ ప్రారంభంతో భారత్‌లో టెస్లా సుదీర్ఘంగా ఎదురుచూసిన ప్రవేశానికి నాంది పలికింది. ఈ సందర్భంగా తన పాపులర్​ కార్​​ అయిన మాడల్​–వైని ప్రదర్శించింది.
ఈ షోరూమ్‌ ప్రారంభానికి తారలు, రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. వీఐపీలు భారీ సంఖ్యలో రావడంతో పోలీసుల భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం గమనార్హం.

టెస్లా ఎలక్ట్రిక్ SUV — Model Y

ప్రస్తుతం టెస్లా ఒక్క మోడల్ వై కారును మాత్రమే భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మోడల్ వై అనేది ఒక ఆల్-ఎలక్ట్రిక్ SUV, ఇది టెస్లా యొక్క హై టెక్ వాహన శ్రేణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. శాంఘైలోని టెస్లా గిగాఫ్యాక్టరీ నుండి ఆరు వాహనాలను దిగుమతి చేసి, ముంబయికి తరలించారు. ఈ కార్లు ప్రదర్శన, టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్‌లో ఉంచబడ్డాయి.
రెండు రకాలు – రెండు ప్రయాణాలు
టెస్లా Model Yని రెండు ప్రధాన వేరియంట్లలో అందించనుంది:
⦁ రియర్​ వీల్​ డ్రైవ్​ (RWD)
⦁ రేంజ్: 500 కిలోమీటర్లు
⦁ వేగం: 0 నుంచి 100 కి.మీ.కి 5.9 సెకన్లలో
⦁ ధర: ₹60 లక్షలు (సుమారు $70,000)
⦁ లాంగ్​ రేంజ్​ రియర్​ వీల్​ డ్రైవ్ (LR RWD)
⦁ రేంజ్: 622 కిలోమీటర్లు
⦁ వేగం: 0 నుంచి 100 కి.మీ.కి 5.6 సెకన్లలో
⦁ ధర: ₹68 లక్షలు (సుమారు $79,000)
ఇక్కడ మరొక వేరియంట్ అయిన AWD (All-Wheel Drive) కూడా పరిశీలనలో ఉంది, కానీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు.

అంతర్గత ఫీచర్లు – టెక్నాలజీకి తలమానికం

మోడల్ వై లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ (నలుపు – తెలుపు), 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్, 9 స్పీకర్లు, వాయిస్ కమాండ్, వైర్‌లెస్ ఛార్జింగ్, USB-C పోర్ట్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, Tesla App ఆధారిత కంట్రోల్, Auto Pilot, మ్యాప్ నావిగేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికి వరకు భారత ప్రజలు చూసిన కార్ల కంటే విభిన్నమైన అనుభూతి టెస్లా ఇవ్వనుంది. వినియోగదారులలో ఆసక్తి ఉన్నప్పటికీ టెస్లా మోడల్ వై ధరలు ఇండియాలో ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఉదాహరణకి, అమెరికాలో Model Y ధర $44,990 కాగా, భారత మార్కెట్లో అదే వాహనం ₹60–₹68 లక్షల మధ్య ఉండడం గమనార్హం. ఈ భారీ వ్యత్యాసానికి కారణం భారత ప్రభుత్వం విధిస్తున్న దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు ప్రస్తుతం CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి అవుతున్నాయి. భారతదేశం పూర్తిగా తయారైన కార్లపై 70% నుండి 100% వరకు దిగుమతి ట్యాక్స్ విధిస్తోంది. ఈ సుంకాలే ధరను విపరీతంగా పెంచుతున్నాయి. ఈ విషయంపై ఎలాన్ మస్క్ సైతం పలుమార్లు ట్వీట్ చేస్తూ భారత దిగుమతి విధానాలను సవాల్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం “దేశంలో ఉత్పత్తి చేయండి” అనే స్పష్టమైన అభిప్రాయాన్ని కొనసాగిస్తోంది.

టెస్లా భారత వ్యూహం

ముంబయి షోరూమ్‌తో టెస్లా తన భారత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీని తరువాత న్యూఢిల్లీలో కూడా జూలై చివరలో మరో షోరూమ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాక, ముంబయి కుర్లా వెస్ట్లో సర్వీస్ సెంటర్ ఏర్పాటులో ఉంది. మరిన్ని నగరాల్లో ఫ్యూచర్ షోరూమ్లు, సూపర్‌చార్జర్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రణాళికలు టెస్లాకు ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరులో రెజిస్టర్డ్ ఆఫీస్, పుణెలో ఇంజినీరింగ్ హబ్ వంటి కార్యకలాపాలతో టెస్లా భారత్‌లో సాంకేతిక స్థావరాలను ఏర్పరుచుకుంది.

భవిష్యత్తు ఆశలు

భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. టెస్లా లాంటి కంపెనీలకు ఇది ఒక భారీ అవకాశంగా కనిపిస్తోంది. అయితే ధరలు, సపోర్ట్, చార్జింగ్ సౌకర్యాలు, మరియు స్థానిక ఉత్పత్తి వంటి అంశాలపై టెస్లా ఎంత వేగంగా స్పందిస్తుందో అనేదే భవిష్యత్ ఫలితాలను నిర్ణయించనుంది.

Exit mobile version