#Mega158 in Trouble? Casting Chaos and Production Shake-Up Rock Chiranjeevi’s Film
సారాంశం:
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా158 చిత్రం ప్రారంభ దశలోనే కాస్టింగ్, నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటోంది. హీరోయిన్ ఎంపిక నుండి నిర్మాణ సంస్థ మార్పుల వరకు గందరగోళం కొనసాగుతోంది. మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందా అన్నది ఆసక్తికరం.
- గందరగోళంలో చిరంజీవి – బాబీ చిత్రం
- ముందుగా హీరోయిన్లతో సమస్య మొదలు
- ముఖ్యపాత్ర కోసం ప్రముఖ నటుల దోబూచులాటలు
- కూతురి పాత్రకు యువ హీరోయిన్ల వెనుకంజ
- వెనక్కితగ్గిన నిర్మాత – సినిమా వేరే సంస్థ చేతుల్లోకి
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
MEGA 158 in Trouble | అట్టహాసంగా పూజలు జరుపుకుని లాంఛనంగా మొదలైన చిరంజీవి – బాబీ చిత్రానికి, షూటింగ్‌కు వెళ్లాల్సిన సమయంలో సినిమా కష్టాలు మొదలయ్యాయి. హీరోయిన్‌తో మొదలై, కూతురి పాత్ర దాకా నటీమణులు ఎవరూ ఖరారు కావడం లేదు.
కథానాయిక ఎంపికతో మొదలైన సమస్యలు
ముందుగా హీరోయిన్ విషయం తీసుకుంటే, మొట్టమొదటగా జేజమ్మ అనుష్కను నాయికగా తీసుకుంటున్నారని వార్తలు వెలువడ్డాయి. అభిమానులు కూడా ఆహా..ఓహో అనుకున్నారు. ఎంతకాలానికి మెగాస్టార్ సరసన అనుష్కను చూడబోతున్నామని సంబరపడిపోయారు. ఇంతలో అనుష్క మాయమయింది. మధ్యలో మాళవికా మోహనన్, రాశీఖన్నాఅన్నారు. తర్వాత ఏకంగా ఐశ్వర్యారాయ్‌ను తీసుకున్నారని గుసగుసలు.. ఈసారి కూడా అబ్బో.. బాబీ బీభత్సంగా ప్లాన్ చేస్తున్నాడనుకుంటే ఏమైందో ఏమో, అది కూడా వెనక్కివెళ్లింది. ప్రస్తుతం కథానాయికగా ప్రియమణి ఎంపికైందని తాజా వార్త. ఇది కొంచెం వర్కవుట్ అయ్యేట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రియమణి ఇప్పుడు కొంచెం మధ్యవయసు అమ్మగా సినిమాల్లోనూ, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. అవన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో చిరంజీవి వయసు మళ్లిన పాత్రలోనే నటిస్తున్నాడు కాబట్టి, ప్రియమణికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అదీకాక, మెగాస్టార్ చిరంజీవి పక్కన అంటే ఆ క్రేజ్ వేరేగా ఉంటుందని తనకు బాగా తెలుసు. మిగతా ముగ్గురు (బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్) టాప్‌స్టార్లతో హీరోయిన్గా నటించిన ప్రియమణికి చిరంజీవి సరసన అప్పట్లో అవకాశం రాలేదు. అది ఈ రూపంలో ఇప్పుడు లభించడంతో ఈ యమదొంగ హీరోయిన్‌కు లక్కీఛాన్సే. అయితే ఈ నాయికావేట ఇక్కడితో ఆగుతుందా? లేదా అనేది వేచిచూడాలి.
చిరంజీవితో ఢీ అనే పాత్రకు సూపర్స్టార్ల డేట్లతో ఇబ్బంది
ఇక ఇంకో ముఖ్యమైన పాత్ర – చిరంజీవి పాత్రకు సరిసమానంగా ఉండే పోలీసాఫీసర్ అంటున్నారు. దానికి ముందుగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అని అన్నారు. బాగుంది..ఇద్దరు స్నేహితులు కలిసి నటిస్తే వేరే లెవెల్లో ఉంటుందని హైప్ క్రియేట్ అయింది. మళ్లీ లాల్ స్థానంలో ఖైదీ కార్తీని తీసుకున్నారని ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. ఇద్దరు ఖైదీల జంట తెరపై బాగా ఉంటుందని, పైగా కార్తీకి ఇంతకుముందే తెలుగు చిత్రంలో నటించిన అనుభవం అదికూడా కింగ్ నాగార్జునతో ఉంది కాబట్టి, ఓకే అయిపోతుందన్న తరుణంలో కథ మళ్లీ మొదటికొచ్చింది. కార్తీకి డేట్స్ సమస్య వచ్చిందంటూ, మళ్లీ మోహన్‌లాల్ ఒప్పుకున్నాడంటూ విషయం తమిళనాడు నుండి కేరళకు వెళ్లిపోయింది. ఇప్పుడు కేరళలో ఉండాలా? బయలుదేరాలా అని బాబీ ఆలోచిస్తున్నాడట. ఇక్కడా డేట్స్సమస్యే. మోహన్‌లాల్‌కు దృశ్యం 3 డేట్స్‌తో క్లాష్ అవుతున్నాయని వార్త.
కూతురి పాత్రకు తటపటాయిస్తున్న యువ హీరోయిన్లు
తదుపరి ఇంకా ఆసక్తికర పాత్రేంటంటే, చిరంజీవి కూతురి పాత్ర. ఈ పాత్రకు కథలో చాలా ఇంపార్టెన్స్ ఉందనీ, పేరున్న యువనటి కావాలని అన్నారు. ముందుగా రేసులోకి వచ్చింది ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి. ఈ మధ్య పెద్దగా కనిపించని కృతి, వెంటనే తెరపై నుండి మాయమైంది. ఆ తరువాత వచ్చిన అమ్మాయి సారా అర్జున్. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో చిన్నప్పటి ఐశ్వర్యారాయ్‌గా నటించి, ఆ తరువాత కథానాయికగా ‘ధురంధర్’తో దుమ్ములేపింది. మరి మళ్లీ ఏం మారిందో, కొన్ని రోజులు ‘ఛాంపియన్’ ఫేం అనస్వర రాజన్ పేరు వినిపించింది. ఇప్పుడు మంచు విష్టు ‘కన్నప్ప’లో నటించిన ప్రీతి ముకుందన్ వార్తల్లో నిలిచింది. ఈ అమ్మాయిలందరూ కూతురు పాత్రనేసరికి వెనుకాడుతున్నట్లు సమాచారం.
ఇలా ముఖ్య నటీనటులు ఫైనల్ కాక ఓ పక్క దర్శకుడు ఇబ్బంది పడుతుంటే, పులి మీద పుట్రలా అసలుకే ఎసరొచ్చింది. అది నిర్మాణ సంస్థ తరపున.
నిర్మాణ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు – చేతులు మారిన ప్రాజెక్ట్?
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణానికి పూనుకుంది. కె.వెంకట నారాయణ నిర్మాత. ఈ బ్యానర్ ఒకేసారి పెద్ద పెద్ద చిత్రాలను నిర్మిస్తోంది. కన్నడంలో కేజీఎఫ్ ఫేం యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో టాక్సిక్, ప్రేమ్ దర్శకుడిగా కేడీ: ది డెవిల్, తమిళంలో దళపతి విజయ్ హీరోగా తన ఆఖరి చిత్రం జననాయగన్, తెలుగులో ఈ చిరంజీవి – బాబీ సినిమాను దాదాపుగా ఒకేసారి సెట్స్‌పైకి వదిలింది. వీటిలో జననాయగన్ షూటింగ్ పూర్తి చేసుకోగా, టాక్సిక్ పోస్ట్ ప్రొడక్షన్లోనూ, కేడీ అండర్ ప్రొడక్షన్లోనూ ఉన్నాయి. చిరంజీవి సినిమా మార్చిలో పట్టాలెక్కాల్సివుంది.
ఇంతలో జననాయగన్ చిత్రం సెన్సార్ బోర్డు – కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయిన ప్రాంతాలనుండి బయ్యర్ల ఒత్తిడి మొదలైంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంస్థ, చిరు చిత్రం నుండి తప్పుకున్నట్టుగా విశ్వనీయ వర్గాల కథనం. తాజాగా రామ్‌చరణ్ పెద్ది సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్(వెంకట సతీశ్ కిలారు) ఈ చిత్రాన్ని టేకప్ చేసినట్లుగా సమాచారం. సరే.. నిర్మాణ సంస్థలతో పెద్ద సమస్యేమీ ఉండదు. ఒకరు కాకపోతే ఇంకొకరు రెడీగా ఉంటారు. చిరంజీవి మార్కెట్ అలాంటిది. పైగా నిన్ననే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ విజృంభించి 400 కోట్లు వసూలు చేసేసరికి ఆశలు ఆకాశంలో ఉన్నాయి.
మార్చిలో షూటింగ్ ప్రారంభమని ప్రకటన – జరిగే పనేనా?
ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దర్శకుడు బాబీ కొల్లి పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో, చిరంజీవిని కొంచెం ఓల్డ్ గెటప్‌లో పాటలు లేకుండా, సీరియస్ టోన్‌లో చూపించాలనుకుంటే పరిస్థితులు తనకు పరీక్ష పెడుతున్నాయి. చూద్దాం.. ఈ సమస్యల నుండి బాబీ ఎలా గట్టెక్కుతాడో.. అయితే ఇదంతా అధికారిక సమాచారం కాదు కానీ, చిత్రబృందంతో దగ్గరగా మెసిలే వారినుంచి వచ్చినవే. కాబట్టి ఎంతో కొంత నిజముండకపోదు. ఏదైమైనా అధికార ప్రకటన కోసం మరింత కాలం వేచిచూడాల్సిందే.
