One Rupee Doctor | వ‌న్ రూపీ డాక్ట‌ర్..! ఆ మూడు టెస్టులు కూడా ఒక్క‌ రూపాయికే..!!

One Rupee Doctor | పురుషులందు పుణ్య పురుషులు వేర‌యా..! అన్న‌ట్టు వైద్యులందు ఈ వైద్యుడు వేరయా..! అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే పేద రోగుల‌ పాలిట ఆపద్బాంధవుడయ్యారు ఆ డాక్ట‌ర్. కేవ‌లం రూపాయికే వైద్యం అందిస్తున్నారు. అంతే కాదు. వేల రూపాయాల్లో ఖ‌ర్చయ్యే స్పైరోమెట్రీ( Spirometry ), బీఎండీ( BMD ), ఈసీజీ( ECG ) వంటి టెస్టుల‌ను కేవ‌లం రూపాయికే అందిస్తూ తన ఔదర్యాన్ని చాటుతున్నారు. పేద రోగుల‌కు ప్రాణం పోస్తూ.. వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారు. మ‌రి ఆ వ‌న్ రూపీ డాక్ట‌ర్( One Rupee Doctor ) గురించి తెలుసుకోవాలంటే ఒడిశా( Odisha ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

One Rupee Doctor | ఒడిశా( Odisha )లోని సాంబ‌ల్‌పూర్ జిల్లాకు చెందిన డాక్ట‌ర్ శంక‌ర్ రామ్‌చందాని( Dr Shankar Ramchandani ) 2016 నుంచి VIMSAR మెడిక‌ల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పేద రోగుల‌కు వైద్యం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బుర్లా మార్కెట్‌ ఏరియాలో ‘లాజ్వంతి వన్ రూపీ క్లినిక్’ పేరుతో ప్రారంభించారు. అక్క‌డ ప్ర‌తి రోజు పేద రోగుల‌కు రూపాయికే వైద్యం అందిస్తున్నారు డాక్ట‌ర్ శంక‌ర్.

ఆ మూడు టెస్టులు కూడా రూపాయికే..

కేవ‌లం రూపాయికే వైద్యం అందించ‌డం కాదు.. డాక్ట‌ర్ శంక‌ర్ మ‌రో గొప్ప ప‌నికి శ్రీకారం చుట్టారు. వంద‌లు, వేల రూపాయాల్లో ఖ‌ర్చ‌య్యే ఈసీజీ( ECG ), స్పైరోమెట్రీ( Spirometry ), బీఎండీ( BMD ) వంటి టెస్టుల‌ను కూడా రూపాయికే అందిస్తున్నారు. స్పైరోమెట్రీ, బీఎండీ టెస్టుల‌కు బ‌య‌ట రూ. 1000 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. కానీ డాక్ట‌ర్ శంక‌ర్ మాత్రం ఈ టెస్టుల‌కు ఒక రూపాయి చొప్పున మాత్ర‌మే తీసుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి స్పైరోమెట్రీ, బీఎండీ యంత్రాలను కొనుగోలు చేశారు. ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు చాలా మంది ఈ క్లినిక్‌ నుంచి ప్రయోజనం పొందుతున్నారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ.. మ‌నుషుల‌కు సేవ చేయ‌డ‌మే ఉత్త‌మ సేవ అని స్ప‌ష్టం చేశారు. రూపాయికే వైద్యం అందిస్తున్నాం. ఈ సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌రిచేందుకు య‌త్నిస్తున్నాం. అత్య‌వ‌స‌ర మందులు, నెబ్యులైజ‌ర్ వంటి సేవ‌ల‌ను కూడా రూపాయికే అందిస్తున్నాం. త‌న భార్య కూడా డాక్ట‌రే. ఆమె కూడా వ‌న్ రూపీ డాక్ట‌ర్‌గా ప్ర‌సిద్ధిగాంచారు. స్పైరోమెట్రీ, బీఎండీ టెస్టుల‌ను కేవ‌లం రూపాయికే అందిస్తున్న దేశంలోనే తొలి డాక్ట‌ర్‌గా శంక‌ర్ పేరొందారు. స్పైరోమెట్రీ యంత్రాన్ని రూ. ల‌క్ష‌, బీఎండీ ప‌రిక‌రాన్ని రూ. 9 ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

రూపాయికే వైద్యం.. దాని వెనుకున్న క‌థ‌ ఇదే..

నా చిన్న‌త‌నంలో అనేక ఆర్థిక క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాం. తాత‌, మామ నా క‌ళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. వారు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌డంతో వైద్యం చేయించేందుకు డ‌బ్బుల్లేక వారి ప్రాణాల‌ను పోగొట్టుకున్నాం. ఆ రోజే నాకు ఆలోచ‌న వ‌చ్చింది డాక్ట‌ర్ కావాలి. పేదల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ ఆలోచ‌న‌లే.. నేడు వ‌న్ రూపీ డాక్ట‌ర్‌గా న‌న్ను మార్చాయి. కొవిడ్ స‌మ‌యంలో ఈ క్లినిక్‌ను ప్రారంభించాను. పేదలలో ఊపిరితిత్తుల వ్యాధులు, ఎముక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడానికి, వారికి సకాలంలో చికిత్స అందించడానికి ఇప్పుడు మేము ఈ స్పైరోమెట్రీ, బీఎండీ పరీక్షా ప్రయోగశాలను ప్రారంభించామ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు.

డాక్ట‌ర్ శంక‌ర్‌కు రుణ‌ప‌డి ఉంటా.. ఓ రోగి భావోద్వేగం ఇదీ

తాను శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాను. కానీ త‌న ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే. డాక్ట‌ర్ శంక‌ర్ రూపాయికే వైద్యం అందిస్తున్న‌ట్లు విన్నాను. దాంతో ఈ క్లినిక్‌కు రాగానే త‌న‌కు టెస్టులు చేసి.. చికిత్స అందించారు. కేవ‌లం రూపాయితోనే త‌న ఆరోగ్యం మెరుగైంది. అదే బ‌య‌ట ఈ టెస్టుల‌కు రూ. 1000 ఖ‌ర్చు అవుతుంది. అంతే కాకుండా డాక్ట‌ర్ ఫీజు కూడా రూ. 500. కానీ డాక్ట‌ర్ శంక‌ర్ మొత్తం రూపాయికే అందించార‌ని రోగి మందాకిని దాస్ భావోద్వేగానికి లోన‌య్యారు.

ప‌రిశ్ర‌మ‌ల‌తో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు..

అయితే సాంబ‌ల్‌పూర్‌, జ‌ర్సుగూడ‌, రూర్కేలా, హీరాకూడ్ ఏరియాల్లో ప‌రిశ్ర‌మ‌లు అధికంగా ఉన్నాయి. ఈ ప‌రిశ్ర‌మ‌ల ద్వారా వెలువ‌డే కాలుష్యం కార‌ణంగా.. స్థానికులు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే రోగుల‌కు డాక్ట‌ర్ శంక‌ర్ క్లినిక్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని రోగి మందాకిని దాస్ స‌హాయ‌కుడు జ‌యంత్ ప‌ట్నాక్ పేర్కొన్నాడు. వైద్య చ‌రిత్ర‌లోనే డాక్ట‌ర్ శంక‌ర్ సేవ‌లు అద్భుత‌మ‌ని కొనియాడాడు.

Latest News