Okra Tree | సాధారణంగా బెండకాయ మొక్కలు( Okra Trees ) నాలుగైదు అడుగుల వరకు పెరుగుతాయి. బెండకాయలు( Okra ) కూడా నిగనిగలాడుతూ ఆకర్షిస్తుంటాయి. అలాంటి లేత బెండకాయలు కూడా రుచిగా ఉంటాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. సాధారణ బెండకాయ మొక్కకు విరుద్ధంగా ఓ బెండకాయ మొక్క అందనంత ఎత్తుకు ఎదిగింది. నాలుగైదు అడుగులను దాటేసి.. ఏకంగా 15 అడుగుల ఎత్తుకు పెరిగింది బెండకాయ చెట్టు. ఈ రకమైన బెండకాయ చెట్టు పశ్చిమ బెంగాల్( West Bengal )లోని వీర్‌భూం జిల్లా బోల్‌పూర్( Bolpur )లోని ఓ ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది.
బోల్‌పూర్‌లోని భువన్‌దంగాకు చెందిన మహమ్మద్ జమీరుల్ హక్ వృత్తిరీత్యా న్యాయవాది. ఇక రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. తన ఇంటి ఆవరణలోనే కూరగాయల మొక్కలు పెంచుతున్నాడు. ఇక బెండకాయ మొక్కలను కూడా నాటాడు. కానీ ఈ బెండకాయ చెట్టు ఊహించని విధంగా పెరిగింది. తన రెండంతస్తుల భవనం ఎత్తుకు ఎదిగి.. బాహుబలి బెండకాయ చెట్టుగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా బెండకాయ మొక్కలు నాలుగైదు అడుగుల వరకు పెరుగుతాయి.. కానీ ఇది మాత్రం 15 అడుగుల ఎత్తు వరకు పెరిగి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే 10 అడుగుల ఎత్తు పెరిగిన తర్వాతనే బెండకాయలు కాయడం ప్రారంభమైంది.
బొప్పాయి చెట్టును పోలి..
15 అడుగుల ఎత్తుకు పెరిగిన బెండకాయ చెట్టు.. బొప్పాయి చెట్టును పోలి ఉంది. కాండం నుంచి మొదలు పెడితే ఎత్తుతో పాటు ఆకుల వరకు బొప్పాయి చెట్టు మాదిరే ఉంది. ఈ బెండకాయ చెట్టు మొదలు లావుగా ఉంది. తద్వారా ఆ మొక్క కాస్త చెట్టు ఆకారాన్ని సంతరించుకుంది. ఈ చెట్టు ఆకులు చూసేందుకు బొప్పాయి ఆకుల్లా పెద్దగా ఉన్నాయి. చెట్టుపై నుంచి కింద వరకు గుత్తులుగా వేలాడుతున్న బెండకాయలు, నిరంతరం వికసించే పూలతో దూరం నుంచి చూస్తే ఆకుపచ్చ స్తంభంలాగా కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉన్న బెండకాయలను యజమాని పొడవాటి కర్రకు కొక్కెం తగిలించి కోస్తారట.
