Terrace Gardening | మీకు టెర్రస్ ఉందా..? సులభంగా ఈ 5 కూరగాయలు పండించండి మరి..!
Terrace Gardening | మీకు కూరగాయలు( Vegetables ) పండించుకోవాలని ఉందా..? అయితే భూమి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు టెర్రస్( Terrace ) ఉంటే చాలు.. తాజా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు. మండు వేసవి( Summer )లోనూ ఈ ఐదు వెజిటబుల్స్ సులభంగా పండించొచ్చు. మరి ఆ వెజిటబుల్స్ ఏంటో తెలుసుకుందాం.
Terrace Gardening | దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. సరిపడా నీరు లేక మరి ముఖ్యంగా కూరగాయలు( Vegetables ), ఆకుకూరలు పండించలేకపోతున్నారు. దీంతో వెజిటబుల్స్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో మండుటెండల్లోనూ ఈ ఐదు కూరగాయలను సులభంగా పండించొచ్చు. అది కూడా మీ టెర్రస్‌పైనే.
ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా మంది ఆర్గానిక్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. దీంతో ఇంటి ఆవరణలో సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నారు. ఈ పద్ధతిని అవలంభించడంతో కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ టెర్రస్ సాగుకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కూడా. కేవలం గన్నిబ్యాగులు, కంటైనర్లు, ఆయా కూరగాయల విత్తనాలు ఉంటే సరిపోతుంది. ఇక సేంద్రీయ పదార్థాలు అవసరం.
అయితే ఈ మండుటెండలను తట్టుకోగల సామర్థ్యం ఉన్న పంటలు ఏవి అని పరిశీలించినప్పుడు.. ఓ ఐదు ఆకుకూరలు, కూరగాయలు లభించాయి. అందులో ముఖ్యంగా బెండకాయ, మిరపకాయతో పాటు తోటకూర, పాలకూర వంటి పంటలు బాగా పెరుగుతాయి వేసవిలో, ఈ పంటలు సాధారణంగా వెచ్చని వాతావరణంలో పెరుగుతాయి. ప్రస్తుత ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలవు.
బెండకాయ( Okra )

ప్రతి ఇంటి టెర్రస్‌పై సులభంగా పండించే కూరగాయ ఇది. దీని పెరుగుదలకు అధిక ఉష్ణోగ్రతలు కావాలి. ప్రత్యక్ష సూర్యరశ్మిలో బాగా పెరుగుతాయి కూడా. మొక్క నాటినప్పటి నుంచి సూర్యరశ్మి తగిలితే ఏపుగా పెరుగుతుంది. 45 నుంచి 60 రోజుల్లోనే దిగుబడిని ఇస్తుంది. కంటైనర్లలో కోకోపిట్‌తో పాటు సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పెంచితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కంటైనర్లలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. నీరు అలాగే ఉంటే.. తేమ వేర్లను దెబ్బతీసి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. వేప పిండి లేదా మజ్జిగతో తెగుళ్లను నివారించొచ్చు.
పచ్చి మిరపకాయలు..( Green Chillies )

పచ్చి మిర్చి పంట కూడా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలుగుతాయి. వేసవిలోనూ ఈ పంట అధిక దిగుబడిని ఇస్తుంది. ఒక మొక్క కూడా ఇంటికి సరిపడ మిరపకాయలను ఇస్తుంది. పోషణ సరిగా ఉంటే.. నెలల తరబడి దిగుబడి ఉంటుంది. ఇక కంటైనర్లలో వర్మీకంపోస్టును నింపి.. మిరప నారును నాటాలి. నీరు ఎక్కువగా అవసరం ఉండదు. అధిక నీటిని వినియోగించడంతో.. పూత రాలిపోయి.. దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్రతి మూడు వారాలకోసారి కంపోస్టుతో పాటు కట్టెల బూడిద లేదా అరటి తొక్కల ఎరువును వేయొచ్చు. ఈ మొక్కల పెరుగుదలకు ప్రతి రోజు కనీసం 5 నుంచి 6 గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా చర్యలు తీసుకోవాలి. తొలి రోజుల్లో పూతను తెంపేయడం వల్ల సీజన్ చివర్లో అధిక దిగుబడిని ఇస్తాయి.
పాలకూర( Spinach )

పాలకూర కూడా వేసవిలో బాగా పెరుగుతుంది. దీనికి ఎండ అంత అవసరం ఉండదు. అయినా కూడా ఎండను తట్టుకోగలవు ఈ మొక్కలు. 25 నుంచి 30 రోజుల్లోనే పాలకూర చేతికి వస్తుంది. ఈ పాలకూరను నిరంతరం కోయొచ్చు. లోతు తక్కువగా ఉండే ట్రేలలో ఈ విత్తనాలను నాటాలి. సేంద్రీయ ఎరువులనే వినియోగించాలి. ఆకుకూరల పెరుగుదలకు తేమ అవసరం కాబట్టి.. నీటిని క్రమం తప్పకుండా పోయాలి.. కానీ తక్కువగా పోయాలి. పాలకూర పెరుగుదలకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కంపోస్ట్ టీ లేదా ఆవుపేడ ద్రావణాన్ని పోస్తే పెరుగుదల ఉంటుంది.
కాకరకాయ( Bitter Gourd )

కాకరకాయ కూడా వేసవిలో అద్భుతంగా పెరిగే తీగ జాతి మొక్క. టెర్రస్‌పై పెంచుకోవచ్చు. ఈ మొక్కల పెరుగుదలకు వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. అందుకే ఈ మొక్క పెరుగుదలకు వేసవి చాలా అనుకూలమైన కాలం. కంటైనర్లలో విత్తనాలు విత్తి.. ఒక కట్టె కట్టాలి. ఆ కట్టెకు పాకుతూ తీగ పందిరిలా విస్తరిస్తుంది. ఇక ఈ మొక్కలు నీటిని అధికంగా వినియోగించుకుంటాయి. కాబట్టి ప్రతి ఉదయం కాకర మొక్కలకు అధికంగా నీరు పెట్టాలి. మొక్క చుట్టూ మల్చింగ్ చేయడం ఉత్తమం. కాయల కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి వర్మీకంపోస్ట్, సేంద్రీయ ద్రవ ఎరువులను వాడాలి. సీజన్ మొత్తం కూడా కాకర మొక్కలు దిగుబడిని ఇస్తాయి.
తోటకూర( Amaranthus )

భారతీయులు ఇష్టపడే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. ఇది వేసవిని బాగా తట్టుకోగలదు. చిన్న కుండీల్లోనూ ఏపుగా పెరుగుతుంది. విత్తిన 20 నుంచి 25 రోజుల్లోనే కోతకు వస్తుంది. లోతు తక్కువగా ఉండే ట్రేలు, కంటైనర్లలో కంపోస్టు నింపి ఈ విత్తనాలను నాటాలి. ఈ పంట దట్టంగా పెరుగుతుంది. కాబట్టి వేర్లు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోయాలి. నీరు నిలవకుండా కూడా చూసుకోవాలి. ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా మొక్కలను ఉంచాలి. మధ్యాహ్నం వేళ కాస్త నీడలో పెడితే బెటర్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram