Heavy Rain | హైద‌రాబాద్ : గ‌త మూడు నెల‌ల నుంచి ఎండ వేడిమికి త‌ల్ల‌డిల్లిపోయిన న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు శ‌నివారం ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఎందుకంటే ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఎండ దంచికొట్టింది. ఉన్న‌ట్టుండి సాయంత్రం స‌మ‌యానికి వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఐదారు గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తింది. హైద‌రాబాద్, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌రిధిలో ఓ గంట పాటు కుండ‌పోత వ‌ర్షం కురిసింది. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌లు ఎండ వేడిమి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు.

తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గ‌ణాంకాల ప్ర‌కారం.. మియాపూర్‌లో అత్య‌ధికంగా 43.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత షేక్‌పేట‌లో 41.8 మి.మీ., కేపీహెచ్‌బీ కాల‌నీలో 31.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు చోట్ల ట్రాఫిక్ సంభ‌వించింది. ప‌లు కాల‌నీలు నీట‌మునిగాయి. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్ల‌ర్ నంబ‌ర్ 190 వ‌ద్ద భారీగా వ‌ర‌ద నీరు చేర‌డంతో.. అత్తాపూర్ వైపు వెళ్లే వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్ల‌ర్ నంబ‌ర్ 215 వ‌ద్ద కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో ఆరాంఘ‌ర్ వైపు వెళ్లేవారు కూడా ఇబ్బందులు ప‌డ్డారు. షేక్‌పేట ఫ్లై ఓవ‌ర్, టోలీచౌకీ, మియాపూర్ క్రాస్ రోడ్స్ వ‌ద్ద భారీగా వ‌ర‌ద నీరు చేరింది. మోకాళ్ల లోతుకు పైగా వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.