Site icon vidhaatha

QC1 electric scooter । హోండా నుంచి మ‌రో రెండు ఈవీ స్కూట‌ర్లు.. ఫీచ‌ర్లు, వివ‌రాలు ఇవే!

QC1 electric scooter । హోండా మోట‌ర్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ ఇండియా మ‌రో రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్ప‌టికే 11 ఈవీల‌ను ప్ర‌వేశ‌పెట్టిన హోండా.. తాజాగా కొత్త ‘యాక్టివా ఈ’తోపాటు క్యూసీ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకువచ్చింది. గ్రీన్‌ మొబిలిటీ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో ఒకేసారి రెండు వాహనాలను విడుదల చేసింది. ఫ్లూయిడ్‌ డిజైన్‌, అధునాతన ఇంజినీరింగ్‌ల సమ్మిళితంగా కొత్త క్యూసీ1ను కంపెనీ అభివర్ణించింది. కొత్త స్కూటర్ల ధరలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కానీ.. క్యూసీ1 బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లు వంటి వివరాలను పేర్కొన్నది. కొత్త హోండా క్యూసీ 1.. 1.5 కేడబ్ల్యూహెచ్‌ ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే.. 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిని 330వాట్‌ ఆఫ్‌ బోర్డ్‌ హోం చార్జర్‌తో ఇంట్లోనే చార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ చార్జర్‌ ఆటో కట్‌ టెక్నాలజీ కలిగి ఉంటుంది. సున్నా నుంచి 80 శాతం వరకూ చార్జ్‌ చేయడానికి సుమారు 4.30 గంటలు పడుతుంది. ఏడు గంటలలోపు 100 శాతం చార్జ్‌ అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు.

ఇక హోండా క్యూసీ1 ఫీచర్లు, రంగుల విషయానికి వస్తే.. ఐదు అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే, టైప్‌ సీ యూఎస్‌బీ అవుట్‌లెట్‌ ఉంటాయి. 26 లీటర్ల భారీ అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ బాక్స్‌ ఉంటుంది. స్పష్టమైన వింకర్‌లతో పాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. 12 అంగుళాల చక్రాలపై నడిచే క్యూసీ1.. పెర్ల్ సెరినిటీ బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్, మాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ షాలో బ్లూతో సహా 5 విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతానికి క్యూసీ1 ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోని వారికి అందుబాటులో ఉంటుంది. డెలివరీలు వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి నుంచి పొందవచ్చు. ఇతర ఎంపిక చేసిన నగరాల వారికి 2025 ఫిబ్రవరి నుంచి బుకింగ్‌లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ పేర్కొన్నది. కొత్త యాక్టివా ఈ, క్యూసీ 1 స్కూటర్లు బెంగళూరులోని నర్సాపురలో ఉన్న హోండా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ రెండు వాహనాలు మూడు సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్ల వారంటీపై లభిస్తాయి. తొలి ఏడాది మూడు ఫ్రీ సర్వీసింగ్‌లు ఉంటాయి. మొదటి ఏడాదిలో ఉచితంగా రోడ్‌ సైడ్‌ సహాయం కూడా లభిస్తుంది.

Exit mobile version