Site icon vidhaatha

Ghost Jobs | ఖాళీలు లేకున్నా ఉద్యోగ ప్రకటనలు ఎందుకు.. ఏమిటీ ఘోస్ట్‌ జాబ్స్‌..?

Ghost Jobs : సాధారణంగా పలు కంపెనీలు తమ కంపెనీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తాయి. ఇలాంటి ప్రకటనలు చూసి చాలామంది జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతారు. అయితే కొన్ని కంపెనీల విషయంలో నెలల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం ఉండదు. ఆరా తీస్తే చివరకు ఆ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలే లేవనే విషయం తెలుస్తుంది.

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ఈ తరహా ట్రెండ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఖాళీలు లేకున్నా కంపెనీలు నియామక ప్రకటనలు ఇవ్వడం, అంతేగాక నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం, చివరకు అభ్యర్థిని నియమించుకునేందుకు సిద్ధంగా ఉండకపోవడం. ఈ తరహా ధోరణినే ‘ఘోస్ట్ జాబ్స్ (Ghost Jobs)’ గా పరిగణిస్తున్నారు.

మౌరీన్ క్లాఫ్ అనే ఓ మహిళ సోషల్‌మీడియా యాప్‌ ‘థ్రెడ్‌ (Thread)’ లో ‘ఘోస్ట్ జాబ్స్’ గురించి ఆశ్చర్యకర విషయాన్ని షేర్‌ చేశారు. తాను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్‌ఆర్‌ సిబ్బంది ఇలాంటి జాబ్‌ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరినట్లు ఆమె తెలిపారు. ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ కంపెనీ వెబ్‌సైట్లో కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి ఖాళీలు ఉండవు. ఇలాంటి ఓపెనింగ్స్‌ పెట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయమన్నారు. నేను దానికి అంగీకరించలేదు’ అంటూ ఆమె తన ఖాతాలో రాసుకొచ్చారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎందుకిలా..?

ఉనికిలో లేని ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి అవసరం లేకున్నా ఇలా జాబ్‌ ఓపెనింగ్స్‌ పెట్టడానికి భిన్న కారణాలు ఉంటాయని పలు నివేదికలతోపాటు మార్కెట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కొన్ని కంపెనీలు ఇలా చేస్తాయట. భవిష్యత్తులో అవసరమయ్యే పొజిషన్ భర్తీ కోసం కూడా ఒక్కోసారి కంపెనీలు ఇలా చేస్తుంటాయని తెలుస్తోంది.

సాధారణంగా ఇచ్చే ఉద్యోగ ప్రకటనల్లో విధులు, అర్హత, బాధ్యతల గురించి నిర్దిష్ట వివరాలు ఉంటాయి. ఘోస్ట్‌ జాబ్స్‌లో మాత్రం వాటి గురించి పెద్దగా సమాచారం ఉండదు. నెలలు గడిచినా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే వాటిని ఘోస్ట్‌ జాబ్స్‌ అని అర్థం చేసుకోవాలి. లేదా ఏదైనా సంస్థ ఒకే జాబ్‌ రోల్‌ని భర్తీ చేయకుండా రిక్రూట్‌ పోర్టల్‌లో ఎక్కువ కాలం ఉంచినా అది ఘోస్ట్‌ జాబ్‌గా అనుమానించాల్సిందే.

Exit mobile version