Site icon vidhaatha

YouTube | యూజర్లకు యూట్యూట్ షాక్‌.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెంపు

YouTube ‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక అయిన యూట్యూబ్‌ (YouTube) మన దేశంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. దాంతో ఇక నుంచి ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫ్యామిలీ, స్టూడెంట్‌, వ్యక్తిగత ప్లాన్‌ ఇలా అన్నింటి ధరలను యూట్యూబ్‌ పెంచింది. కొత్త ధరలను సంస్థ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

యూట్యూబ్‌ వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరను ఇప్పుడు నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ ధర రూ.129గా ఉండేది. గతంలో రూ.189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ప్రీమియం స్టూడెంట్‌ ప్లాన్‌ ధరను రూ.79 నుంచి రూ.89కి పెంచింది.

ప్రీపెయిడ్‌తోపాటు రెన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను కూడా యూట్యూబ్‌ సవరించింది. వ్యక్తిగత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరను నెలకు రూ.159కి పెంచింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది. ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్‌ ధరను రూ.399 నుంచి రూ.459కి పెంచింది. ఇక వార్షిక ప్లాన్‌ను రూ.1,290 నుంచి రూ.1,490కి పెంచింది. అంటే ఏకంగా రూ.200 అధికం చేసింది.

సాధారణంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు యూట్యూబ్‌ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్‌ యాడ్స్‌ని ప్రసారం చేస్తుంది. ఈ యాడ్స్‌ ప్రసారాన్ని యూట్యూబ్‌ చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. అయితే ఈ యాడ్స్‌ లేకుండా వీడియోలు చూడాలనుకునే వారికి కొంత రుసుము చెల్లిస్తే ప్రీమియమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆ రుసుములనే యూట్యూబ్‌ సవరించింది.

Exit mobile version