Anu Emmanuel | ఇకపై అలాంటి సినిమాల్లో నటించను.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు

తన కెరీర్ పట్ల కొంత అసంతృప్తి ఉందని ప్రముఖ నటి అను ఇమ్మాన్యుయేల్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాల్లో ఇకపై నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ :

తన కెరీర్ పట్ల కొంత అసంతృప్తి ఉందని ప్రముఖ నటి అను ఇమ్మాన్యుయేల్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాల్లో ఇకపై నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రష్మిక మందన్నతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అను ఇమ్మాన్యుయేల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే సినిమా కాబట్టే నటించేందుకు ఒప్పుకున్నానని అను వెల్లడించింది. హాలీవుడ్‌లో లాగా హీరో, హీరోయిన్, విలన్ అనే తేడా లేకుండా అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ దర్శకుడు రాహుల్ ఈ కథను తీర్చిదిద్దారని వెల్లడించింది. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం చూసి తాను ఆనందించానని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యూయెల్.

కమర్షియల్ సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేయిస్తారని, కానీ ఈ చిత్రంలో ‘దుర్గ’ పాత్ర కోసం చాలా సహజంగా నటించానని అను వివరించారు. సమాజంలో మహిళలకు ‘ఎలా మాట్లాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి వంటి ఎన్నో షరతులు ఉంటాయని, కానీ మగవాళ్లకు ఉద్యోగం, సంపాదన తప్ప మరేమీ ఉండవని ఆమె తెలిపారు. తన సినీ ప్రయాణం పట్ల అసంతృప్తిగానే ఉన్నానన్న అను.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగచైతన్య, శివ కార్తికేయన్, కార్తి లాంటి పెద్ద స్టార్స్ తో కలిసి నటించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని చెప్పిన అను ఓ సినిమా ఓకే అయిందన్నారు. త్వరలో నిర్మాణ సంస్థే ఆ వివరాల్ని వెల్లడిస్తుందని ఆమె తెలిపారు.