Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన పాడ్‌కాస్ట్ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పాడ్‌కాస్ట్ సమయంలో అల్లు అర్జున్ టీమ్ 42 షరతులు విధించిందంటూ యాంకర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ పీఆర్ టీమ్ తాజాగా స్పష్టం చేయడం విశేషం. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ‘ఇదే ఆ 42 షరతుల జాబితా’ అంటూ ఒక నోట్ వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.
కావేరీ బారువా పేర్కొన్న కొన్ని అంశాలు ఆ జాబితాలో కనిపించడంతో, ఇది నిజంగానే బన్నీ టీమ్ పాడ్‌కాస్ట్‌కు ముందు ఇచ్చిన నిబంధనల జాబితానేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నెటిజన్ల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరు సెలబ్రిటీలను కలిసే సమయంలో ఇలాంటి మార్గదర్శకాలు సహజమేనని, భద్రతా కారణాల వల్ల టీమ్స్ ఇలాంటి సూచనలు ఇవ్వడం సాధారణమేనని వాదిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది అతిగా వ్యవహరించడమేనని విమర్శిస్తున్నారు.
వైరల్ అవుతున్న జాబితాలోని కొన్ని షరతులు మరింత ఆసక్తికరంగా మారాయి. అల్లు అర్జున్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కనీసం మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి, “స్టైలిష్ స్టార్” కాకుండా “ఐకాన్ స్టార్” అని మాత్రమే సంబోధించాలి, కంటికి ఇబ్బంది కలిగించే దుస్తులు లేదా ఆభరణాలు ధరించకూడదు, ఆయన గదిలోకి రాగానే లేచి నిలబడాలి, వ్యక్తిగత విషయాలు అడగకూడదు, ఫ్యాన్స్‌లా ప్రవర్తించకూడదు, ఆటోగ్రాఫ్‌లు లేదా సెల్ఫీలు కోరకూడదు వంటి నిబంధనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఫోన్ కనిపించేలా పెట్టకూడదని, బయటకు వెళ్లేటప్పుడు వీపు చూపించకూడదనే సూచనలూ ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ‘పుష్ప’ మరియు ‘పుష్ప-2’ చిత్రాల ఘన విజయాల తర్వాత అల్లు అర్జున్ వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయిందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని, స్టార్ స్థాయి పెరిగిన కొద్దీ భద్రతా నియమాలు కఠినంగా ఉండటం సహజమని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ 42 షరతుల జాబితా నిజమా కాదా అన్న దానిపై స్పష్టత రానుంది. అల్లు అర్జున్ టీమ్ అధికారికంగా స్పందిస్తేనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. అప్పటివరకు ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే కొనసాగేలా ఉంది.
