Mega Update | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ విశ్వంభరపై అభిమానుల్లో ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సాగుతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
ఆగస్టు 21 సర్‌ప్రైజ్
ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6:06 గంటలకు విడుదల చేయనున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ సర్‌ప్రైజ్‌పై మెగా అభిమానుల్లో ఇప్పటికే ఉత్కంఠ పెరిగిపోయింది. టీజర్‌నా? పోస్టరా? లేక వేరే ఏదైనా కీలక సమాచారం అనేది తెలిసేలోపే సోషల్ మీడియాలో చర్చలు హోరెత్తుతున్నాయి.
చిరంజీవి ప్రత్యేక వీడియో
తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు ముందస్తు గిఫ్ట్‌గా ఈ అప్‌డేట్ ఇస్తున్నట్లు చిరంజీవి ఓ స్పెషల్ వీడియో ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సినిమా ఆలస్యంపై స్పష్టతనిస్తూ స్వయంగా చెప్పిన మాటలు..
“హాయ్… ఇలా మీ ముందుకి రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి డౌట్ ఉంది ఈ సినిమా ఎందుకు డిలే అవుతుందని… ఈ ఆలస్యం చాలా సముచితం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం VFX, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నత ప్రమాణాలతోటి, బెస్ట్ క్వాలిటీతోటి ఇది మీ ముందు ఉంచాలి. మీకు అందించాలనే దర్శక–నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం.
ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా, శ్రద్ధా శక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇంక ఈ చిత్రం గురించి చెప్పాలంటే… ఇది ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు… మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలు కూడా దీన్ని తప్పకుండా ఆస్వాదిస్తారు.
ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీతో పాటు నాకు కూడా సమాధానంగా UV క్రియేషన్స్ వాళ్లు ఒక చిన్న గ్లింప్స్ మనకి అందించబోతున్నారు. అది నా పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు ముందే అంటే ఆగస్టు 21 సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు విడుదల అవుతుంది. అది మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నాకు నమ్మకం ఉంది.
గ్లింప్స్ వస్తుంది… అది మనల్ని అలరిస్తుంది. సరే… ఇంతకీ రిలీజ్ ఎప్పుడో చెప్పట్లేదే అనుకుంటున్నారు. ఆ సీక్రెట్ ఇప్పుడు చెబుతున్నాను. చిన్నపిల్లలు… పెద్దల్లో ఉండే చిన్నపిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ — అదే సమ్మర్ సీజన్. వచ్చే వేసవి… 2026 సమ్మర్ నాడు ఈ సినిమా మీ ముందుంటుంది.
నాది భరోసా… ఈ సినిమాను చూడండి, ఎంజాయ్ చేయండి, విశ్వంభరని ఆస్వాదించండి, ఆశీర్వదించండి.”
భారీ అంచనాలు
ఈ సినిమాలో త్రిష ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మరో కథానాయికగా అషికా రంగనాథ్ కనిపించనుంది. మరికొంతమంది హీరోయిన్లు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి, సురభి ఇతరులు మెగాస్టార్ చెల్లెళ్ల పాత్రలలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదే మెగాస్టార్ వీడియో సందేశం: చూడండి.