విధాత: జార్ఖండ్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకున్నది. దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తున్న లారీ భక్తులపై పడిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జంషెడ్‌పూర్‌లోని బిస్త్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బోధన్‌వాలా ఘాట్ వద్ద చోటుచేసుకున్నది. రహదారి ఏటవాలుగా ఉండటం, భక్తులు ఒకవైపుకే రావడంతో లారీ ఒరిగి భక్తులపై పడిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, గాయపడిన నలుగురు టాటా ప్రధాన దవాఖానలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి బన్నగుప్తా వెల్లడించారు. దవాఖానను సందర్శించిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
బాధితులంతా బగ్‌బేరా ప్రాంతానికి చెందిన కితాడి పూజా కమిటీ సభ్యులు అని పోలీసులు తెలిపారు. ఇద్దరు భక్తులు చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం ప్రకటించారు. నిమజ్జన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు.