భోపాల్: భోపాల్‌లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక చిల్డ్రన్స్ హోం నుంచి 26 మంది బాలికలు అదృశ్యం కావడం సంచలనం రేపింది. భోపాల్ శివార్లలోని పర్వాలియా ప్రాంతంలోని ఆంచల్ గర్ల్స్ హాస్టల్‌కు జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మిక పర్యటనకు వచ్చిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. హాస్టల్ రిజిస్ట్ర్‌ను పరిశీలించగా.. 68 మంది పేర్లు అందులో ఉంటే.. వారిలో 26 మంది హాస్టల్‌లో లేరన్న సంగతి తేలింది. ఇదే విషయమై హాస్టల్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో బాలిక అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదృశ్యమైనవారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌తోపాటు.. మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రాయిసేన్, ఛింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు కూడా ఉన్నారని సమాచారం.
చట్టవిరుద్ధంగా నడుస్తున్న చిల్డ్రన్స్ హోంలో అనేక అవకతవకలు వెలుగు చూసినట్టు ఎఫ్‌ఐఆర్ పేర్కొంటున్నది. వీధుల్లో తిరుగుతున్న కొంతమంది బాలికలను ఒక మిషనరీ సంస్థ రక్షించి, వారిని ఎలాంటి లైసెన్స్ లేని ఈ చిల్డ్రన్స్ హోంలో ఉంచినట్టు కనుంగో ఎక్స్ వేదికగా తెలిపారు. తన పర్యటనకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వీధుల నుంచి రక్షించిన బాలికలను ఇక్కడ రహస్యంగా ఉంచి, క్రైస్తవాన్ని బోధిస్తున్నారని ఎన్‌సీపీఆర్సీ చైర్మన్ పేర్కొన్నారు. అదృశ్యమైన బాలికల్లో ఎక్కువ మంది ఆరు నుంచి 18 ఏళ్ల వయసువారేనని, అంతా హిందువులేనని తెలిపారు. అయితే.. అదృశ్యమైన పిల్లలందరినీ కనుగొన్నామని, వారిని శిశు సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపర్చామని అధికారులు చెప్పారు.
నిబంధనలేవీ పాటించడం లేదు
బాలల ఆశ్రమంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాల్సి ఉంటుంది. కానీ.. ఇందులో ఒక్క కెమెరా కూడా లేదు. ఇద్దరు మహిళా సిబ్బందితోపాటు మరో ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమే. బాలికల హోంలో రాత్రిపూట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలి. ఈ ఉదంతంపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ పాలనలో ఇటువంటి చట్టవిరుద్ధమైన షెల్టర్ హోంలు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సజ్జన్‌సింగ్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మత మార్పిడితోపాటు భయానకమైన మానవ రవాణా, అనేక అనైతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. కానీ.. వారి హయాలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి’ అని వర్మ విమర్శించారు.