స‌బ్బుల ప‌రిశ్ర‌మ‌లో పేలుళ్లు.. న‌లుగురు మృతి.. ఐదుగురికి గాయాలు

  • Publish Date - October 17, 2023 / 10:09 AM IST
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఘ‌ట‌న



విధాత‌: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని సబ్బుల ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లలో నలుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో కార్మికులు ప‌నిచేస్తుండ‌గా భారీ పేలుడు సంభవించింది. ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించ‌డంతో భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఫ్యాక్టరీ లోపల ఉన్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.


శిథిలాలను తొలగిస్తున్న సమయంలో రెండో పేలుడు సంభవించింది. ఆ స‌మ‌యంలో ఘ‌ట‌నాస్థ‌లి వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో గుమికూడిన ప్ర‌జ‌ల‌కు ఇటుకలు వ‌చ్చి త‌గిలాయి. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. నలుగురి మృతదేహాలను శిథిలాల నుంచి బ‌య‌ట‌కు తీశారు. గాయ‌ప‌డిన మ‌రో ఐదుగురిని ద‌వాఖాన‌కు తరలించారు


మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యకం స్కూల్ ఎదురుగా అద్దె ఇంట్లో సబ్బు ఫ్యాక్టరీ నిర్వ‌హిస్తున్నారు. సంజయ్ గుప్తాకు చెందిన ఇంట్లో అలోక్ గుప్తా, గౌరవ్ గుప్తా స‌బ్బుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ను న‌డుపుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఎస్పీ, జిల్లా మేజిస్ట్రేట్‌తో సహా పోలీసులు సంద‌ర్శించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా పిలిపించారు. కొన్ని రసాయనాలతో కూడిన బాయిలర్ పగిలిపోవడంతో పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.