విధాత: హిందూ ఆలయాలకు ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్‌లో పర్యటించాలన్నది వారి దశాబ్దాల కల. ఆదికైలాష్ ఆలయాన్ని దర్శించుకుని తరించాలన్నది చిరకాల వాంఛ. అనుకున్నట్టుగానే ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. దేవదేవుడి స్మృతులను మదిలో తలచుకుంటూ తిరుగుపయనమయ్యారు. దర్చుల్లా-లిపిలేఖ్ జాతీయ రహదారిపై స్వామి తేజస్సును కీర్తిస్తూ ఆనందంగా కారులో పయనం సాగిస్తున్నారు.
లిపులేఖ్ రోడ్‌లో బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కాళీ నదిలో పడిపోయింది. క్షణాల్లో కారులో ప్రయాణించిన ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో బెంగళూరు, ఉత్తరాఖండ్‌కు చెందిన నలుగురితోపాటు తెలంగాణకు చెందిన వారు ఇద్దరున్నట్టు పితోర్‌గర్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్ తెలిపారు.
తెలంగాణవాసుల మరణవార్త విన్న బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆదిపరమేశ్వరుడు ఏమాత్రం కరుణ చూపలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దైవదర్శనం ప్రాణం మీదికి తెస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ బోరున విలపించారు.