విధాత:భర్తపై ఉన్న కోపంతో బెంగుళూరు నుంచి విశాఖ నగరానికి వచ్చిన వివాహితను ఇద్దరు యువకులు మోసగించిన ఘటనపై గోపాలపట్నం పోలీసు స్టేషనులో కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి క్రైం ఇంఛార్జి ఎస్సై కాంతారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన వివాహిత(26)కు భర్తతో వివాదాలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కల్యాణ్ అనే వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉద్యోగం చేస్తుండగా.. ఈమెతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి తరచూ ఫోన్‌లో సంభాషించుకునేవారు. ఈ పరిచయంతోనే ఆమె రెండు రోజుల క్రితం విశాఖకు చేరుకుని లాడ్జిలో ఉంటోంది. తనతో తెచ్చుకున్న నగదు అయిపోవడంతో బెంగళూరు వెళ్లేందుకు శనివారం సాయంత్రం ప్రయాణమయ్యింది.
కల్యాణ్, ఇతడి స్నేహితుడు ఎండీ జాఫర్ కలిసి ఆమెను ద్విచక్రవాహనంపై రైల్వేస్టేషన్ తీసుకెళ్లారు. రైలు లేకపోవడంతో విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ కూడా విమాన సేవలు లేకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు ఎక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా ఎన్‌ఏడీ కూడలి వద్ద కల్యాణ్ ద్విచక్రవాహనం దిగిపోయి వివాహితను బస్టాండ్‌లో దించేయమని ఆమెను జాఫర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు.
జాఫర్ ఆమెను గోపాలపట్నం మీదుగా అడివివరం తీసుకువెళ్లాడు. మార్గ మధ్యలో తనకు మూత్రం వస్తుందని నమ్మించి ద్విచక్రవాహనం దిగాలని వివాహితను కోరాడు. దీంతో ఆమె కొద్ది దూరంలో ఉండగా ద్విచక్రవాహనంపై ఉంచిన బ్యాగులో ప్రయాణ ఖర్చుల కోసం దాచిన రూ.10 వేల నగదు, బంగారం గొలుసు, ఉంగరంతో ఉడాయించాడు.
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పెందుర్తి ట్రాఫిక్ ఎస్సై ఎం.భరత్‌కుమార్‌రాజు సీసీ ఫుటేజ్ ఆధారాలతో అదే రోజు రాత్రి కల్యాణ్, జాఫర్‌లను అదుపులోకి తీసుకుని నగదు, వస్తువులను ఆమెకు అప్పగించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.