బెంగుళూర్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌

కర్ణాటక రాష్ట్రం బెంగ‌ళూర్‌లోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంభ‌వించిన బాంబు పేలుడు ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి

  • Publish Date - March 1, 2024 / 01:46 PM IST

  • తొమ్మిది మందికి గాయాలు
  • ఉగ్ర చర్యగా అనుమానాలు
  • అనుమానిత వ్యక్తి దుశ్చర్యగా సీఎం సిద్ధరామయ్య ప్రకటన

విధాత, హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం బెంగ‌ళూర్‌లోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంభ‌వించిన బాంబు పేలుడు ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్ధంతో మంటలు రేగడంతో మొద‌ట గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ని అంతా భావించారు. అయితే సీసీ కెమెరాల పరిశీలన అనంతరం ఎవరో కావాలని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కేఫ్‌లో ఉంచి వెళ్లిన బ్యాగులో పేలుడు సంభ‌వించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పేలుడు సంభ‌వించిన వెంట‌నే భ‌యంతో హోట‌ల్ సిబ్బంది, క‌స్ట‌మ‌ర్లు ప‌రుగులు తీశారు. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, ఫోరెన్సిక్‌ అధికారులు అక్క‌డికి చేరుకుని ఆధారాల‌ను సేక‌రించారు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. క‌ర్నాటక డీజీపీ డాక్ట‌ర్ అలోక్ మోహ‌న్, బెంగ‌ళూర్ పోలీస్ క‌మిష‌న‌ర్ బి. ద‌యానందలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ బాంబు పేలుడు ఘటనతో కర్ణాటకలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగి పేలుళ్ల ఘటనపై విచారణ కొనసాగిస్తుంది.

అనుమానిత వ్యక్తి దుశ్చర్యనే : సీఎం సిద్ధరామయ్య

కాగా రామేశ్వర్ కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన ఓ అనుమానిత వ్యక్తి దుశ్చర్యగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు. ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ బాంబు కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామన్నారు. బెంగ‌ళూర్‌లోని వైట్‌ఫీల్డ్‌లో పేరొందిన‌ రామేశ్వ‌రం కేఫ్ అవుట్‌లెట్‌లో పేలుళ్ల‌తో న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. కాగా రామేశ్వర్ కేఫ్ పేలుళ్ల ఘటనకు బాధ్యులుగా ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ తేజ‌స్వీ, స్థానిక నేత పీసీ మోహన్‌లు స్పందిస్తూ బాంబు పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య బెంగుళూర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో హై అలర్ట్‌

బెంగుళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. బెంగుళూర్ పేలుళ్లకు కారణాలను కూడా తెలుసుకుంటున్నామని సీపీ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

Latest News