బిగ్‌బాస్ విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అరెస్ట్

బిగ్‌బాస్ -7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అరెస్టు అయ్యారు. గ‌జ్వేల్ మండ‌లం కొల్గూరులో ప్ర‌శాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Publish Date - December 20, 2023 / 02:11 PM IST

హైద‌రాబాద్ : బిగ్‌బాస్ -7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అరెస్టు అయ్యారు. గ‌జ్వేల్ మండ‌లం కొల్గూరులో ప్ర‌శాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్న‌పూర్ణ స్టూడియో వ‌ద్ద పోలీసు వాహ‌నాలు, ఆర్టీసీ బ‌స్సును అత‌ని అభిమానులు ధ్వంసం చేసిన కేసులో ప్ర‌శాంత్‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌పై మొత్తం 9 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. అరెస్టు అనంత‌రం ప్ర‌శాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  

బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ పోలీసు వాహ‌నాలు, ఆర్టీసీ బ‌స్సును ధ్వంసం చేసిన కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కేసులు పెడుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌ను కూడా వదిలిపెట్టలేదు. పల్లవి ప్రశాంత్‌ను ఏ1గా, అతని తమ్ముడు మనోహర్‌ను ఏ2గా కేసు నమోదు చేశారు.

ప్ర‌శాంత్ అరెస్టుకు నేప‌థ్యం ఇదీ.. 

బిగ్‌బాస్ -7 విజేత‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచాడనే వార్త తెలియ‌డంతో చాలామంది ఫ్యాన్స్‌ అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. అదే సమయంలో అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ కూడా అక్క‌డికి చేరుకున్నారు. అమ‌ర‌దీప్ ఫ్యాన్స్‌ను చూసిన‌ పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్న‌పూర్ణ స్టూడియో ముందే దాడులు చేసుకుని, ఒక ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు.

అదే స‌మ‌యంలో స్టూడియో ముందు వెళ్తున్న‌ ఆర్టీసీ బస్సుల‌తో పాటు పోలీసుల వాహ‌నాల‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్టీసీ బ‌స్సును ధ్వంసం చేసినందుకు గానూ, స‌జ్జ‌నార్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్‌ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ మేరకు పల్లవి ప్రశాంత్, అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌, ఏ-2గా అతని తమ్ముడు మనోహర్‌, ఏ-3గా మరో స్నేహితుడి పేరును నమోదు చేశారు.