విధాత: దేశ రాజధాని దిల్లీ (Delhi) లో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువతి హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వెస్ట్ దిల్లీలోని తిలక్ నగర్‌లో శుక్రవారం ఓ యువతి మృతదేహం కనపడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెను స్విట్జర్లాండ్ నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన లీనా బెర్జర్‌గా పోలీసులు గుర్తించారు.
ప్లాస్టిక్ బ్యాగ్‌లో సగం చుట్టేసిన ఆ అమ్మాయి శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా.. కాళ్లు చేతులు కట్టేసి హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. అనంతరం భారత్‌లోని ఆమె స్నేహితుడు గురుప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. నిందితుడు స్విట్జర్లాండ్‌లో పర్యటించినపుడు అతడికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత భారత్‌కు వచ్చేసినప్పటికీ ఆమె కోసం అప్పుడప్పుడూ స్విస్‌కు వెళుతుండే వాడు. ఈ క్రమంలో ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానపడ్డాడు. ఆమె మీద కోపంతో రగిలిపోయి చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం సరదాగా గడుపుదాం అంటూ లీనాను భారత్‌కు ఆహ్వానించాడు. ఈ నెల 11న ఆమె దిల్లీ రాగా.. గురుప్రీత్ తన రూంకు తీసుకెళ్లాడు. తర్వాత కాళ్లు చేతులు కట్టేసి చంపేశాడు. తొలుత ఆ మృతదేహాన్ని కారులోనే పెట్టుకుని తిరిగినప్పటికీ.. దుర్వాసన రావడం మొదలవడంతో తిలక్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పడేశాడు. అది స్థానికుల కంట పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి ఇంటి నుంచి రూ.2.25 కోట్లను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.