Dharmasthala Mass Burial Case | ధర్మస్థల ఖననాల కేసు : రికార్డులన్నీ ధ్వంసం! RTI సమాధానంలో నివ్వెరబోయే అంశాలు!

ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో నివ్వెరబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అసాధారణ మరణాలకు సంబంధించిన కేసులను బెల్తంగడి పోలీస్‌ స్టేషన్‌లో ఒక పద్ధతి ప్రకారం రికార్డులను తొలగిస్తూ వచ్చారని రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ ద్వారా వెల్లడైంది. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్యకాలంలో నమోదైన కేసులను ఇలా తొలగించారు. ఇదే సమయంలో అనేక నమోదుకాని, అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం.

  • Publish Date - August 3, 2025 / 05:19 PM IST

Dharmasthala Mass Burial Case | ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో నివ్వెరబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అసాధారణ మరణాలకు సంబంధించిన కేసులను బెల్తంగడి పోలీస్‌ స్టేషన్‌లో ఒక పద్ధతి ప్రకారం రికార్డులను తొలగిస్తూ వచ్చారని రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ ద్వారా వెల్లడైంది. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్యకాలంలో నమోదైన కేసులను ఇలా తొలగించారు. ఇదే సమయంలో అనేక నమోదుకాని, అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం.

జాడ లేకుండా పోయిన వ్యక్తుల వివరాలు, ఫొటోలు ఇవ్వాలని జయంత్‌ అనే ఆర్టీఐ కార్యకర్త ఆర్టీఐ ద్వారా గతంలో బెల్తంగడి పోలీసులను కోరారు. దానికి పోలీసులు ఇచ్చిన సమాధానం విస్మయం కల్పించేలా ఉన్నది. వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, పోస్టుమార్టం రిపోర్టులు, వాల్‌ పోస్టర్లు, నోటీసులు, ఫొటోలు అన్నీ రోజువారీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆదేశాల మేరకు తాము ధ్వంసం చేశామని పోలీసులు తెలిపారు. ‘ఆగస్ట్‌ 2న నేను సిట్‌కు ఒక ఫిర్యాదు చేశాను. నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విషయం ఆధారంగా ఈ ఫిర్యాదు అందించాను. ఆ సమయంలో అక్కడ ఉన్నవారి పేర్లన్నింటినీ నేను ఫిర్యాదులో ప్రస్తావించాను. అందులో కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఒక బాలిక శవం లభించినప్పుడు అన్ని న్యాయపరమైన ప్రొసీడింగ్స్‌ ఉల్లంఘనకు గురయ్యాయి. వాళ్లు ఆ శవాన్ని కుక్కను పూడ్చిపెట్టినప్పట్టు పాతేశారు. ఆ దృశ్యం నన్ను అనేక ఏళ్లు వెంటాడింది. నిజాయతీ ఉన్న పోలీసు అధికారులు ఈ విషయంలో దర్యాప్తు చేస్తానంటే వాస్తవాన్ని బయటపెడతానని రెండేళ్ల క్రితమే చెప్పాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే ఫిర్యాదు దాఖలు చేశాను. ఈ పని చేయడంలో నా వెనుక ఎవరూ లేరు. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు’ అని జయంత్‌ తెలిపారు.

రికార్డులు అడిగితే అన్నీ ధ్వంసం చేసేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ సాంకేతిక యుగంలో అటువంటి రికార్డులన్నీ డిజిటైజ్‌ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారు? అని ఆయన ప్రశ్నించాడు. ఈ రికార్డులు ధ్వసం చేస్తే.. ఏదైనా అస్తిపంజరం లభ్యమైనపక్షంలో వాటిని గుర్తించడానికి ఎలా వీలు కలుగుతుంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎవరు ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చుతున్నారు? కంపూటర్లలో బ్యాక్‌అప్‌కు అవకాశం ఉన్నప్పుడు వాటిని బ్యాక్‌అప్‌ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారు? వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరుగాలి’ అని జయంత్‌ అన్నాడు.

2000 నుంచి 2015 మధ్యకాలానికి సంబంధించిన గుర్తు తెలియని మృతుల కేసుల రికార్డులను ధ్వంసం చేసిన బెల్తంగడి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను అనేక మృతదేహాలను ఖననం చేశానని ఒక సాక్షి చెబుతున్న సమయంలో ఈ అన్ని సంవత్సరాలూ ఉండటం గమనార్హం. 1998 నుంచి 2014 మధ్య కాలంలో అనేక మంది మహిళలు, యువతులు, బాలికల శవాలను తాను బలవంతంగా ఖననం చేయాల్సి వచ్చిందని గతంలో ధర్మస్థలలో పనిచేసిన పారిశుధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లైంగికదాడులు జరిగినట్టు ఆ శవాలపై ఆనవాళ్లు కనిపించాయని కూడా అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.