- మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్య
- యువ డాక్టర్ల దాంపత్యంలో విషాదం
Reels Girl Sparks Marital Tragedy in Warangal l విధాత, వరంగల్ ప్రతినిధిః ఇద్దరు డాక్టర్లు…ఇద్దరికి మంచి సంపాదన ఉంది. పెళ్ళై దాదాపు ఏడేళ్ళయ్యాయి. ఇద్దరు పిల్లలతో ముచ్చటగా సాగుతున్న యువ డాక్టర్ దంపతుల కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గర్ల్ (బుట్టబొమ్మ) చిచ్చుపెట్టింది. పచ్చని సంసారం విచ్ఛిన్నమైంది. భర్త పట్టించుకోకపోవడంతో తీవ్రమనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా(Hanamakonda) హసన్‌పర్తి మండలంలో (Hasanparthi Mandal) సోమవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హసన్ పర్తి కి చెందిన డాక్టర్ ప్రత్యూషను() 2017లో డాక్టర్ సృజన్ కు వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. సృజన్ హనుమకొండలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కార్డియాలాజిస్టుగా(Cardiologist) పనిచేస్తున్నారు.
సాఫీగా సాగుతున్న వీరి దాంపత్యజీవితంలోకి ఆకస్మికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)అనే యువతి ఎంటర్ కావడంతో ఆ కాపురంలో చిచ్చురేగింది. భార్య పిల్లలున్నప్పటికీ బుట్టబొమ్మతో డాక్టర్ సృజన్ ప్రేమాయణం సాగించారు. ఇది తెలిసి ప్రత్యూష పలుమార్లు తన భర్తను ప్రశ్నించింది. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. బుట్ట బొమ్మ ప్రేమలో పడి సృజన్ తనను పట్టించుకోవడం లేదని.. తీవ్ర మనస్తాపానికి గురైన భార్య డాక్టర్ ప్రత్యూష సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. హాయిగా సాగుతున్న దాంపత్యంలో ఆకస్మిక విషాదం ఏర్పడింది. డాక్టర్ సృజన్ తన కూతురిని వేధిస్తూ తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని, పలు మార్లు హింసించాడని మృతురాలు ప్రత్యూష తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడు సృజన్‌ను హసన్ పర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎంజీఎం హాస్పిట్‌కు తరలించారు.
