విధాత: సచివాలయంలో నకీలు హల్ చల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల పీఏ, పీఎస్, అడిషనల్ పీస్, ఓఎస్‌డీ, అడిషనల్ ఓఎస్‌డీలమంటూ మంత్రుల పేషీలు, సెక్రటరీల పేషీలలో తిరుగుతున్నారు. ‘ఎమ్మెల్యే చెప్పారు.. ఫలానా లెటర్ ఇవ్వండి.. ఫలానా ఫైల్ మూవ్ చేయండి’ అంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సహజంగా ఒక్క ఎమ్మెల్యేకు ఒక పీఏ ఉంటారు. ఎవరైనా సీనియర్ ఎమ్మెల్యేలు ఉంటే మరొకరిని అదనంగా పెట్టుకుంటారేమో కానీ ఇంత మంది ఉంటారా? అని సచివాలయంలో అధికారులు నోరెళ్ల బెడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారంతా ఏదో ఒక పైరవీ తీసుకొని సచివాలయానికి వస్తున్నాని సమాచారం. దీంతో ఆయా మంత్రులు, అధికారుల పేషీల సిబ్బంది వీరిని ఎలా నిర్ధారించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వచ్చిన వాళ్లు మీ వాళ్లేనా? అని సదరు ఎమ్మెల్యేను అడగలేని పరిస్థితి. అలా అని ఊరుకోలేని పరిస్థితి ఆయా పేషీలలోని అధికారులు, సిబ్బందికి ఏర్పడిందని అంటున్నారు. ధృవీకరించుకునేందుకు తిరిగి ఎమ్మెల్యేకు తాము ఫోన్ చేయలేమని, దీంతో తమ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని చెపుతున్నారు. నిజంగా ఎమ్మల్యేలు పనుల మీద పంపిస్తే చేసి పెట్టడానికి తమకేమీ అభ్యంతరం ఉండదు కానీ, నిజంగా ఎమ్మెల్యే పంపించారా లేదా? అన్నది ఎలా నిర్థారణ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ నేతలు ఏదో ఒక పరిష్కారం చూడాలని మొరపెట్టుకుంటున్నారు.