Site icon vidhaatha

Illegal Affair | భార్యతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని.. 7 అడుగుల గొయ్యి తీసి

Illegal Affair | అక్ర‌మ సంబంధాలు మాన‌వ సంబంధాల‌ను తెంచేయ‌డ‌మే కాదు.. అమానుష హ‌త్య‌ల‌కూ దారి తీస్తున్న ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ప‌రువు ప్ర‌తిష్ఠ‌లు కోల్పోయి నిందితులు జైళ్ల‌పాల‌వుతుంటే.. వారి పిల్ల‌లు అనాథ‌లుగా మిగిలిపోతున్నారు. తాజాగా హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌లో ఇటువంటి హ‌త్యోదంతం మూడు నెల‌ల త‌ర్వాత వెలుగు చూసింది. త‌న భార్య‌తో పొరుగింటి వ్య‌క్తి అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని అనుమానించిన భ‌ర్త‌.. అత‌డిని వ్య‌వ‌సాయ పొలాల్లో ఏడు అడుగుల లోతైన గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టాడు. ఫిజియోథెర‌పిస్టు అయిన హ‌తుడి మృత‌దేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఈ కేసులో ఇద్ద‌రు అనుమానితుల అరెస్టు నేప‌థ్యంలో ఈ హ‌త్య వెలుగు చూసింది. పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మృతుడు జ‌గ్దీప్ (45) రోహ‌త‌క్ నివాసి. బాబా మ‌స్త్‌నాథ్ యూనివ‌ర్సిటీలో ప‌నిచేస్తున్నాడు. గ‌త మూడేళ్లుగా జ‌న‌తా కాల‌నీలో క‌మ‌ల అనే మ‌హిళ‌కు చెందిన ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. క‌మ‌ల కుమార్తె దీప‌ను వివాహం చేసుకున్న రైతు రాజ్‌క‌ర‌ణ్‌.. జ‌గ్దీప్‌తో దీప స్నేహం చేస్తున్నద‌ని అనుమానించాడు. దీనితో అత‌డిని ఎలాగైనా చంపాల‌ని నిర్ణ‌యించుకుని, త‌న చార్ఖీ దాద్రి జిల్లాలోని సొంత‌గ్రామం పైంట‌వాస్‌లో ఉంటున్న ఇద్ద‌రు వ్య‌క్తుల స‌హాయం తీసుకున్నాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 24వ తేదీన వారు ముగ్గురూ జ‌గ్దీప్ ఉంటున్న ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చారు. అక్క‌డ అత‌డిపై దాడి చేసి, పైంట‌వాస్‌కు ఒక వాహ‌నంలో తీసుకొచ్చి, స‌జీవంగా పూడ్చిపెట్టారు.

ఛార్ఖీదాద్రిలో ఒక వ్య‌క్తి హ‌త్య‌కు గురైన‌ట్టు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు స‌మాచారం అందింద‌ని రోహ్‌త‌క్ ఏఎస్‌పీ వైవీఆర్ శ‌శి శేఖ‌ర్ తెలిపారు. వెంట‌నే ద‌ర్యాప్తు మొద‌లు పెట్టిన పోలీసులు.. రోహ్‌త‌క్‌లో మిస్సింగ్ కేసుల‌ను ప‌రిశీలించారు. డిసెంబ‌ర్ నెల నుంచి జ‌గ్దీప్ అనే వ్య‌క్తి క‌నిపించ‌డం లేద‌ని వారు సేక‌రించిన వివ‌రాల్లో తేలింది. తప్పుడు కేసులో అరెస్టు చేశారంటూ జగ్దీప్ మామ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైనట్టు గుర్తించారు.

అయితే.. దర్యాప్తు సందర్భంగా జగ్దీప్‌ను కిడ్నాప్ చేసి, హత్య చేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. తదుపరి దర్యాప్తులో రాజ్‌కరణ్‌కు సహకరించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో.. జగ్దీప్‌ను పూడ్చిపెట్టిన చోటుకు వెళ్లి.. అక్కడ తవ్వగా మృతదేహం లభ్యమైంది. రోహ్‌తక్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జగ్దీప్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. రాజ్‌కరణ్‌, మరో నిందితుడి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్య, కిడ్నాప్ సహా పలు అభియోగాలు నమోదు చేశారు.

 

Exit mobile version