బీఆరెస్‌కు ఇచ్చిన స్థలంలో న్యూస్‌ చానల్‌..ఇన్నాళ్లూ ఏం చేశారన్న కోర్టు

బీఆర్‌ఎస్‌ పార్టీకి 2004లో బంజారాహిల్స్‌ లో భూమిని కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో పిటిషనర్‌ తీరును హైకోర్టు తప్పుబట్టింది

  • Publish Date - January 24, 2024 / 03:38 PM IST

– 2004లో బంజారాహిల్స్‌ లో బీఆర్ఎస్ కు ఎక‌రం స్థ‌లం కేటాయింపు

– ఆ స్థ‌లంలో న్యూస్ చానెల్‌ న‌డుప‌డం ఏంటీ?

– తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేసిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌

– విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసిన ధ‌ర్మాస‌నం

విధాత‌, హైద‌రాబాద్: బీఆర్‌ఎస్‌ పార్టీకి 2004లో బంజారాహిల్స్‌ లో భూమిని కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో పిటిషనర్‌ తీరును హైకోర్టు తప్పుబట్టింది. 20 ఏండ్ల కింద‌ట భూమి కేటాయిస్తే ఇప్పటివరకు ఎందుకు పిటిషన్ దాఖ‌లు చేయ‌లేద‌ని ప్రశ్నించింది. కారణాలు తెలుపుతూ పిటిషన్‌ను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. 2004లో బీఆర్‌ఎస్‌ పార్టీకి తక్కువ ధరకు ఎకరం స్థలం కేటాయించారని, తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ 12లో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థ‌లంలో టీ న్యూస్ చానెల్ పేరుతో ప్రైవేట్ సంస్థ‌ను న‌డుపుతున్నార‌ని, ఇది చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు.


ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. 2004లో ప్రభుత్వం పార్టీ కోసం ఎక‌రం స్థ‌లాన్ని జీవో నంబ‌ర్ 955 విడుద‌ల చేసింద‌ని, కానీ పార్టీ కోసం కేటాయించిన స్థలంలో భవనం నిర్మించి అందులోనే ఓ న్యూస్ చానెల్‌ను కూడా నడుపుతున్నారని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇలా పార్టీ కార్యాల‌యం కోసం కేటాయించిన భూమిలో భ‌వ‌నం నిర్మించి న్యూస్ చానెల్‌ లేదా మిగ‌తా వాటికి ఉపయోగించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14,21 మ‌రియు39(బీ)ని ఉల్ల‌గించ‌డం అవుతుంద‌ని తెలిపారు. దీంతో వెంట‌నే జోక్యం చేసుకున్న ధర్మాసనం ఎకరం స్థలం కేటాయిస్తూ 2004లో ప్రభుత్వం జీవో నంబర్ 966 విడుదల చేస్తే ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించింది. పిటిషన్‌ను మార్చి దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. అనంత‌రం త‌దుప‌రి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.