విధాత, హైదరాబాద్ : తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ ఆనంద్ వెల్లడించారు. పట్టుబడిన పైరసీ ముఠా తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. ఈ ముఠా పైరసీ వల్ల సినీ పరిశ్రమకు రూ.22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని..అందులో తెలుగు సినీ పరిశ్రమకు రూ.3,700 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పైరసీతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారన్నారు. గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలు విడుదల రోజునే లీక్ చేసి, క్రిప్టో పేమెంట్ల ద్వారా వ్యాపారం సాగించారని తెలిపారు.
పైరసీ ఇలా చేసేశారు
టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని.. కొత్తగా ఎంవో విధానంలోనూ చేస్తున్నారని..థియేటర్‌కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని సీపీ ఆనంద్ తెలిపారు. కొత్తగా డిజిటల్ శాటిలైట్‌ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారని..పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ‘సింగిల్’, ‘హిట్’ సినిమాల పైరసీ జరిగినప్పుడు మాకు ఫిర్యాదులు అందాయని.. పైరసీ కేసులో జానా కిరణ్‌కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మరొకరికి పంపించాడని వివరించారు.
ఆధునిక టెక్నాలాజీతోనే ఆటకట్టు
పైరసీ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని.. పోలీసులు ఎప్పటికీ తమను పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నామని నిందితులు భావించారని.. మేం కేసును ఛేదించిన విధానం తెలిసి నిందితులు సైతం ఆశ్చర్యపోయారని సీపీ ఆనంద్ తెలిపారు. కిరణ్ కుమార్ కు బెట్టింగ్ యాప్‌ల నుంచి నెలకు సుమారు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని వివరించారు. ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లను కూడా పెట్టుకున్నారని.. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్‌కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారని వెల్లడించారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌తో నిందితులు థియేటర్ లోసినిమాను రికార్డింగ్ చేస్తారని.. సెల్‌ఫోన్లను జేబులో గానీ, పాప్‌కార్న్ డబ్బాలో గానీ పెట్టి ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తుందని తెలిపారు. . రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్ స్క్రీన్‌లైట్ కూడా ఆఫ్‌లో పెడుతున్నారని..దీంతో ఎవరికీ అనుమానం రాకుండా రికార్డింట్ చేస్తున్నారన్నారు. ఎక్కువ సినిమాల పైరసీ కిరణ్, అశ్వనీకుమార్ ముఠా వల్లే జరిగిందని తెలిపారు.
నిందితుల్లో బెస్ట్ హ్యకర్
క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా మాకు కొంత క్లూ దొరికందని సీపీ ఆనంద్ తెలిపారు. మరో ప్రధాన నిందితుడు పట్నాకు చెందిన అశ్వనీకుమార్ హ్యాకింగ్‌లో నిపుణుడని.. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉందని గుర్తించామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంటు వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశాడని.. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసేశాడని.. ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగులు, జీతాల వివరాలు పొందగలిగాడని తెలిపారు. బీహార్‌లో ఉన్న అతని ఇంటికి సైబర్ క్రైమ్ బృందం తనిఖీలు చేస్తే. అతని ఇంటికి 22 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని.. పట్నాలో కూర్చుని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడని వెల్లడించారు. నిందితుల వల్ల పలు కంపెనీలు వాళ్ల ఉద్యోగులను అనుమానించే పరిస్థితి ఏర్పడిందని.. సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది.. బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులలేనని తెలిపారు. పైరసీ సైట్లలోని లింక్‌లను క్లిక్ చేస్తే యూజర్ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయని… డిజిటల్ మీడియా హౌస్‌లు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సినిమా ఫుటేజీని భద్రపరచుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే..సర్వర్‌కు ఒక ప్రొటెక్షన్ లు గుర్తించి పలు మార్గాల్లో చొరబడుతారన్నారు.
డబ్బు కోసం పైరసీ వ్యాపారం
నిందితులు బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బు సంపాదించే లక్ష్యంతోనే సినిమాల పైరసీ చేస్తున్నారని సీపీ వెల్లడించారు. సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్, ప్యారిస్ ఐపీ అడ్రస్‌లు పెట్టి సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నాడని.. ఇతనికి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు నెలకు రూ.9లక్షలు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించాం అని సీవీ ఆనంద్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హర్షవర్ధన్ ఈటీవీ కంటెంట్‌ను పైరసీ చేశాడని వివరించారు. ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఎన్నికల జాబితాను మాత్రమే చూశారని.. పైరసీ ద్వారా నిందితులు లక్ష డాలర్ల వరకు సంపాదించారని తెలిపారు.