బాలిక తండ్రి ప్రాణం తీసిన గార్బా బ‌హుమ‌తి.. ఇదీ జ‌రిగింది!

  • Publish Date - October 25, 2023 / 09:31 AM IST
  • ఏడుగురు క‌లిసి ఒక్క‌డిని చిత‌క‌బాదారు



పోర్‌బంద‌ర్‌: గుజ‌రాత్‌లో గార్బా నృత్యాల బ‌హుమ‌తి ప్ర‌దానంలో గొడ‌వ‌.. 11 ఏళ్ల బాలిక తండ్రిని బ‌లిగొన్న‌ది. స‌ద‌రు బాలిక రెండు ఈవెంట్ల‌లో గెలిస్తే.. ఒక్క‌దాంట్లోనే బ‌హుమ‌తి ఇచ్చార‌ని త‌న తండ్రికి చెప్పింది. దీనిపై నిర్వాహ‌కుల‌తో మాట్లాడేందుకు త‌ల్లి వెళ్లిన స‌మ‌యంలో స‌మ‌యంలో వాగ్వాదం జ‌రిగింది. అనంత‌రం ఆర్గ‌నైజ‌ర్లు.. బాధితుల ఇంటికి వ‌చ్చి.. దుడ్డుక‌ర్ర‌ల‌తో బాద‌డంతో తండ్రి చ‌నిపోయాడు.


గుజ‌రాత్‌లోని పోర్‌బంద‌ర్‌లో కృష్ణాపార్క్ సొసైటీ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ద‌ని పోలీసులు తెలిపారు. మృతుడిని స‌ర్మాన్ ఒడేద‌రా (40)గా గుర్తించారు. మంగ‌ళ‌వారం రాత్రి బాగా పొద్దుపోయిన త‌ర్వాత 2 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని పోలీసులు తెలిపారు.


ఎఫ్ఐఆర్‌లో ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. న‌వ‌రాత్రి సంద‌ర్భంగా కృష్ణాపార్క్ స‌మీపంలోని ఒక పాఠ‌శాల‌లో గార్బా నృత్య పోటీల‌ను నిర్వ‌హించారు. స‌మీపంలోనే ఒడేద‌రా కుటుంబం నివసిస్తున్న‌ది. రెండు ఈవెంట్ల‌లో గెలిస్తే ఒక‌దానికే బ‌హుమ‌తి ఇచ్చార‌ని త‌న 11 ఏళ్ల కుమార్తె చెప్ప‌డంతో ఆర్గ‌నైజ‌ర్ల‌తో మాట్లాడేందుకు తాను సోమ‌వారం రాత్రి వెళ్లాన‌ని ఒడేద‌రా భార్య మాలిబెన్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


అయితే.. నిర్వాహ‌కుల్లో ఒక‌రైన కేశ్‌వాలా దురుసుగా మాట్లాడుతూ.. ఇచ్చింది తీసుకొని వెళ్లాల‌ని, లేదంటే దానిని కూడా వ‌దిలేసి పోవాల‌ని అన్నారు. అదే స‌మ‌యంలో కుచ్చాడియా, బొఖిరియా కూడా వ‌చ్చారు. మాలిబెన్‌తో వారు కూడా వాగ్వాదానికి దిగారు. అక్క‌డి నుంచి వెళ్ల‌క‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు. కుచ్చాడియా, బొఖిరియాల భార్య‌లు కూడా అక్క‌డికి చేరుకుని, మాలిబెన్‌ను అక్క‌డి నుంచి వెళ్లిపోవాలంటూ దుర్భాష‌లాడారు.


దీంతో మాలిబెన్‌, ఆమె కుమార్తె రాత్రి ఒంటిగంట స‌మ‌యంలో ఇంటికి చేరుకున్నారు. గంట త‌ర్వాత మాలిబెన్‌, ఆమె భ‌ర్త ఇంటి బ‌య‌ట కూర్చొని ఉండ‌గా.. న‌లుగురు ప్ర‌ధాన నిందితులు, మ‌రో ముగ్గురు మోట‌ర్ సైకిళ్ల‌పై వ‌చ్చి, ఒడేద‌రాను క‌ర్ర‌ల‌తో, చెక్క‌ల‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్టు కొట్టారు. త‌న భ‌ర్త‌ను కాపాడే క్ర‌మంలో మాలిబెన్‌కు కూడా గాయాల‌య్యాయి.


అక్క‌డి నుంచి ఒడేద‌రాను గార్బా వేదిక వ‌ద్ద‌కు త‌మ బైక్‌ల‌పై తీసుకుపోయారు. వెంట‌నే ఈ విష‌యాన్ని బాధితుల కుమార్తె పోలీసుల‌కు తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు మ‌ళ్లీ క‌ర్ర‌ల‌తో ఒడేద‌రాను తీవ్రంగా కొట్టారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఒడేద‌రాను వెంట‌నే ద‌వాఖాన‌కు త‌ర‌లించినా.. అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు.