బోరబండలో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి బలవన్మరణం

  • Publish Date - October 13, 2023 / 08:16 AM IST

విధాత : హైద్రాబాద్‌లో కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో రెండు కుటుంబాలు తనువు చాలించాయి. బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాజీవ్‌ నగర్‌లో జ్యోతి(31) తన ఇద్దరు పిల్లలు అర్జున్‌(4), ఆధిత్య(2)లకు విషమిచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి బంజారాహీల్స్‌లో టీచర్‌గా పని చేస్తుండగా, ఆమె భర్త సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భవానీ నగర్‌లో శ్రీకాంత్‌ చారి తన ఇద్దరు కూతుళ్లు స్రవంతి(8), శ్రావ్య(7)లకు నిద్రమాత్రలు ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయా సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బెంగుళూరులో కూతురు పీక కోసి చంపిన తండ్రి


బెంగుళూరు శివారులోని దేవనహళ్లి తాలుక బీదనూర్‌కు చెందిన మంజునాథ్‌ తన పెద్ద కూతురు కవన(20)ను కిరాతకంగా పీక కోసి హత్య చేసి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అంతకుముందే ప్రేమ పేరుతో ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. పెద్ద కూతురు కవన కూడా తాను ఒకరిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ రేగింది. ఇద్దరు కూతుర్లు ప్రేమ పేరుతో తన పరువు తీస్తున్నారన్న ఆగ్రహంతో రగిలిపోయిన మంజునాథ్‌ రాత్రి వేళ నిద్రిస్తున్న కవనపై కట్టెలతో విచక్షణ రహితంగా కొట్టి, పీక కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.